జనసేన 30 శాతం ఫార్ములా... 60 ఎమ్మెల్యే సీట్లు టార్గెట్ !
కూటమిలో ముఖ్యమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ రాజకీయ వాటాను తీసుకోవడంలో మిత్ర ధర్మం పొత్తు ధర్మం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు.
By: Satya P | 9 Sept 2026 8:05 PM ISTజనసేన ముప్పై శాతం ఫార్ములా ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. జనసేన తన రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దానికి స్థానిక ఎన్నికల నుంచే అమలులో పెట్టడానికి చూస్తోంది. 2024 ఎన్నికలు వేరు, అప్పటి రాజకీయ వాతావరణం వేరు అని జనసేన అంటోంది. అప్పట్లో మొత్తం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో జనసేన తీసుకున్నవి కేవలం 21 సీట్లు మాత్రమే. అంటే ఇది మొత్తం సీట్లలో 8 శాతం మాత్రమే. అలాగే 25 ఎంపీ సీట్లలో జనసేన రెండు మాత్రమే పొత్తులో తీసుకుంది. ఇది 12 శాతంగా చూడాల్సి ఉంది. ఇక 26 నెలల కూటమి పాలన ముగిసిన తరువాత వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ పొత్తు నంబర్లు మార్చాలని జనసేన గట్టి పట్టుదలతో ఉంది. దాని కోసం తన వంతుగా ప్రయత్నం చేస్తోంది. అలాగే కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటోంది.
కీలక వాటాగానే :
ఇక వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తుందని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా పార్టీ సమావేశంలో చేరిన వ్యాఖ్యలు ఇపుడు చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. కూటమిలో ఉంటూనే జనసేన బలపడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెబుతున్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మొత్తం 175 సీట్లలో 60 సీట్లుగా చూస్తే ముప్పయి శాతంగానే ఉంది. దాంతో వచ్చే ఎన్నికలలో జనసేన గణనీయంగా తన బలాన్ని పెంచుకోవడానికి తగిన వ్యూహాలను రూపొందించుకుంటూ అంటున్నారు. కూటమిలో ముఖ్యమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ రాజకీయ వాటాను తీసుకోవడంలో మిత్ర ధర్మం పొత్తు ధర్మం ఉందని జనసేన నేతలు భావిస్తున్నారు.
సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో :
ఇక జనసేన నిదానంగా ఎదుగుతోంది అని అంటున్నారు. తమకు ఎక్కడ బలం ఉందో గుర్తిస్తోంది. దానికి తగినట్లుగానే సీట్లు అడిగి తీసుకోవాలని చూస్తోంది. ఇలా తీసుకున్న సీట్లలో నూటికి నూరు శాతం గెలిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటోంది. ఆ విధంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ రాజకీయంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది అని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 60 సీట్లలో పోటీ చేసి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు కాకపోయినా మెజారిటీ సీట్లు గెలిచినా ఏపీ రాజకీయాల్లో జనసేన ఒక కీలక భూమిక పోషించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అందుకే జనసేన దాని కంటే ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పయి శాతం సీట్లు కవాలని కోరుతోంది అని అంటున్నారు.
పట్టు కొమ్మలుగా :
స్థానిక సంస్థలు అన్నవి రాజకీయంగా క్షేత్ర స్థాయిలో విస్తరించడానికి పట్టు కొమ్మలుగా జనసేన భావిస్తోంది. ప్రభుత్వం రాష్ట్రంలో ఉండటం, కేంద్రంలో కూడా మిత్ర పక్షం ఉండడంతో స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధి విశేషంగా చేసేందుకు ఆస్కారం కలుగుతుంది. నిధులు కూడా దండీగా రప్పించుకోవచ్చు. ఆ విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే 2029 నాటికి అది జనసేనకు ప్లస్ అవుతుందని దాంతో తమకు రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ఒక వేదిక దొరుకుతుందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద జనసేన వ్యూహాలు చూస్తే భవిష్యత్తు రాజకీయాల మీద కచ్చితంగానే ఆశలు పెంచుకుని అడుగులు వేస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు.
