జానారెడ్డికి రేవంత్ రెడ్డి పరామర్శ.. సీనియర్ నేతకు ఏమైంది?
ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను పరామర్శించేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు.. సభా సమయం గురించి కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది.
By: Garuda Media | 1 Jan 2026 6:07 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించా రు. హైదరాబాద్‌లోని జానా రెడ్డి నివాసానికి ఒక్కరే వెళ్లిన.. సీఎం రేవంత్ రెడ్డి..ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సుమారు 40 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు జానారెడ్డి గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి వెలుగు చూసింది. జానా రెడ్డి వయసు రీత్యా.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయనకు మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన రెస్టు తీసుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను పరామర్శించేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు.. సభా సమయం గురించి కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి తొలుత అన్నగారు ఎన్టీఆర్ హయాంలో ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకివచ్చారు. అన్నగారి మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత.. అనూహ్యంగా కాంగ్రెస్ బాటపట్టిన జానారెడ్డి.. మర్రి చెన్నారెడ్డి, జనార్దన్‌రెడ్డి సహా వైఎస్ రాజశేఖరరెడ్డి లకు చేరువయ్యారు. తన పనితీరుతోనే ఆయన సమాధానం చెప్పేవారు.
ముఖ్యంగా రాజకీయాల్లో హుందాగా వ్యవహరించేవారు. తెలంగాణ వాది అయినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరక పోవడం గమనార్హం. అనేక ఆఫర్లువచ్చినా.. ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్లకుండా.. కాంగ్రెస్‌లోనే కొనసాగారు. తర్వాత.. ఆయన హోం శాఖ మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా కూడా కాంగ్రెస్ హయాంలో పనిచేశారు. ఇక, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలినాళ్లలో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆయన పలు సందర్భాల్లో ఖండించారు. ముఖ్యంగా సొంత ప్రభుత్వంపై చేసే విమర్శలను కూడా తోసిపుచ్చేవారు.
కుమారుడి భవిష్యత్తుపై చర్చ!
ప్రస్తుతం జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన వారసుడిని మంత్రిగా చూడాలని జానారెడ్డి కలలు కనేవారు. తొలి ప్రయత్నంలోనే సాధించాలని అనుకున్నారు. అప్పట్లో ఆయనపై సొంత నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చినప్పుడు కూడా జైవీర్ రెడ్డి రాజకీయ భవితవ్యం గురించి చర్చించినట్టు తెలిసింది. దీనిపై రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని సమాచారం. కాగా.. జానారెడ్డి అన్ని పార్టీల్లోని నాయకులకు చేరువైన నేతగా గుర్తింపు పొందారు.
