Begin typing your search above and press return to search.

దళపతి ‘జననాయగన్’కి ఝలక్.. వెండితెరపైకి రాజకీయ యుద్ధం!

తమిళనాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. కొత్తగా పార్టీని ప్రారంభించి రాజకీయ సంచలనం సృష్టించాలని భావిస్తున్న టీవీకే అధిపతి విజయ్ కి ప్రత్యర్థులు షాక్ ఇస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   10 April 2026 5:16 PM IST
దళపతి ‘జననాయగన్’కి ఝలక్.. వెండితెరపైకి రాజకీయ యుద్ధం!
X

తమిళనాడు రాజకీయాలు కాకరేపుతున్నాయి. కొత్తగా పార్టీని ప్రారంభించి రాజకీయ సంచలనం సృష్టించాలని భావిస్తున్న టీవీకే అధిపతి విజయ్ కి ప్రత్యర్థులు షాక్ ఇస్తున్నారు. ప్రధానంగా ఆయన చివరి సినిమాగా ప్రకటించిన జననాయగన్ రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం పెను దుమారానికి దారితీస్తోంది. సెన్సార్ కోసం పంపిన కాపీనే బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడంతోపాటు నిర్మాతలను ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేసిన పనిగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ ని లక్ష్యంగా చేసుకున్న వారే సినిమాకు సెన్సార్ అనుమతి రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయ్ చివరి సినిమాగా ‘జననాయగన్’ను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇదే సమయంలో ఎన్నికలు దగ్గరపడటం, సెన్సార్ పూర్తికాకపోవడం, సినిమాలో కొన్ని రాజకీయ పరమైన సంభాషణలు ఉన్నాయనే ప్రచారంతో అభిమానులు తీవ్ర ఉత్కంఠ నడుమ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం అర్ధరాత్రి కొన్ని వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. ఈ లీక్ పై అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆ వెంటనే పూర్తి చిత్రం పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది.

ఈ ఎపిసోడ్ ను గమనించిన వారు 2014 ఏపీ ఎన్నికల ముందు ‘అత్తారింటికి దారేది’ సినిమా లీక్ ను గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రకటిస్తారని అనుకుండగా, పవన్ సినిమాను పైరసీ సైట్లలో రిలీజ్ చేశారు. ఈ ఘటనపై పవన్ తీవ్రంగా స్పందించారు. అయితే అప్పట్లో అభిమానులు పవన్ కు బాసటగా నిలిచి సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబాకారు. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అభిమానులు అదేవిధంగా రియాక్ట్ అవుతారని నిర్మాతలు ఆశలు పెట్టుకుంటున్నారు.

సినిమా రిలీజ్ ఆలస్యం కావడం, పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీక్ వల్ల సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల మేర వ్యాపారం ప్రమాదంలో పడిందని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని సినీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఇలాంటి పరిణామాల వల్ల విజయ్‌ను కావాలనే ఇబ్బంది పెడుతున్నారనే భావన ప్రజల్లోకి వెళ్తే, అది ఆయన పార్టీకి రాజకీయంగా లాభించే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ విషయంలో జరిగినట్టే, అభిమానులు దీనిని వ్యక్తిగత సవాల్‌గా తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.