Begin typing your search above and press return to search.

పీకే పార్టీ ఎవ‌రి కోసం: నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో గగ్గోలు!

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తు లేకుండా పోటీకి రెడీ అయిన‌... జ‌న్ సురాజ్ పార్టీ.. వ్య‌వ‌హారం జాతీయ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

By:  Garuda Media   |   6 Oct 2025 10:00 PM IST
పీకే పార్టీ ఎవ‌రి కోసం:  నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో గగ్గోలు!
X

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తు లేకుండా పోటీకి రెడీ అయిన‌... జ‌న్ సురాజ్ పార్టీ.. వ్య‌వ‌హారం జాతీయ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఈ పార్టీ అదినేత‌, రాజ‌కీయ వ్యూహ‌కర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌( పీకే) వ్య‌వ‌హరిస్తున్న తీరు.. ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు. కాంగ్రెస్ కూటమికి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారా యి. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఉన్న జేడీయూ-బీజేపీ కూట‌మి, అదేవిధంగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూట‌మిల‌కు ప్రత్యామ్నాయంగా తాను అవ‌త‌రించాన‌ని పీకే చెబుతున్నారు. కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న పాద‌యాత్ర కూడా చేశారు.

అయితే.. అంద‌రూ దీనిని నిజ‌మేన‌ని అనుకున్నారు. పైగా.. 7 శాతం ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేయ‌గ ల నేర్పు.. కూర్పు కూడా.. పీకే సొంత‌మ‌ని.. ఇటీవ‌ల స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. అలాంటిది ఆయ‌న ఎన్ని క‌ల‌కు స‌మ‌యం చేరువ కావ‌డం.. త్వ‌ర‌లోనే పోలింగ్ కూడా జ‌రుగుతున్న త‌రుణంలో యూట‌ర్న్ తీసుకు న్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను.. ఆయా ప్ర‌భుత్వాల‌ను ఆయ‌న టార్గెట్ చేస్తున్నా రు. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి `ర‌బ్బ‌ర్ స్టాంప్‌` అంటూ చేసిన వ్యాఖ్య‌లు కూట‌మికి క‌ల్లోలంగా మారాయి.

కాంగ్రెస్ కూట‌మికి అధికారం అప్ప‌గిస్తే.. ఢిల్లీ నుంచి పాల‌న జ‌రుగుతుంద‌ని.. బీహారీల మ‌నోభావాల‌కు ఇది ఇబ్బందిక‌ర‌మ‌ని పీకే వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తో అస‌లు పీకే వ్య‌వ‌హారం ఏంటి? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆది నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌(వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పీకేను స‌ల‌హాదారుగా నియ‌మించుకుంది.. బీజేపీనే) పీకే.. ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌చ్చినా.. బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరుంది.

ఇప్పుడు కూడా త‌న సొంత పార్టీ ఎలానూ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేనందున‌.. కాంగ్రెస్ కూట‌మిని దెబ్బ‌కొట్టే వ్యూహంతో ఆయ‌న ముందుకు సాగుతున్నార‌ని.. జాతీయ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నారు. వేసే ప్రతి అడుగు.. చేసే ప్ర‌తి ప్ర‌క‌ట‌నలోనూ మోడీని ఎక్క‌డా విమ‌ర్శించ‌క‌పోవ‌డం.. కేంద్రంపై ఎక్క‌డా ఒక్క‌మాట కూడా అన‌క‌పోవ‌డం వంటివి.. ఈ వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్‌-ఆర్జేడీ కూట‌మి తీవ్ర‌స్థాయిలో అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. చివ‌ర‌కు పీకే.. బీజేపీకి తురుపు ముక్క‌లా మారుతారాన్న వాద‌నా వినిపిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.