Begin typing your search above and press return to search.

చైనీయుల ట్రాప్ లో సైనికాధికారి భార్య.. అసలేమైందంటే?

ఆమె సాదాసీదా వ్యక్తి కాదు. ఆర్మీలో ఉన్నత అధికారి భార్య. అంతేకాదు.. విద్యావేత్త కూడా.

By:  Garuda Media   |   19 Oct 2026 3:26 PM IST
చైనీయుల ట్రాప్ లో సైనికాధికారి భార్య.. అసలేమైందంటే?
X

ఆమె సాదాసీదా వ్యక్తి కాదు. ఆర్మీలో ఉన్నత అధికారి భార్య. అంతేకాదు.. విద్యావేత్త కూడా. అలాంటి ఆమె.. విద్య.. పరిశోధన సంబంధించిన కార్యకలాపాలు చేస్తానన్న పేరుతో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించటమే కాదు.. చైనా నిఘా అధికారులతో పాటు విదేశీ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా ఆమెపై జమ్ములోని పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఆర్మీలో సీనియర్ అధికారి భార్య పాలపర్తి నాగలక్ష్మిపై షాకింగ్ ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జమ్ములో భర్తతో కలిసి నివసిస్తున్న ఆమెను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు. 2023లో ఐక్యరాజ్యసమితిలో ఐటీ ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ఫ్రీలాన్స్ పరిశోధకురాలిగా వ్యవహరిస్తున్నారు.

విదేశీ విశ్వవిద్యాలయాలు.. పరిశోధనా సంస్థలకు చెందిన విద్యావేత్తలుగా నటించిన చైనా ఏజెంట్లు ఆమెను ఆన్ లైన్ లో పరిచయం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట్లో పర్యావరణం.. అంతర్జాతీయ సంబంధాలు లాంటి సాధారణ అంశాలపై ఆమెతో ఆర్టికల్స్ రాయించుకున్న వారు.. ఆ తర్వాత వ్యూహాత్మక.. సైనిక రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని ఆమె ద్వారా తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఆమె ఇంటెలెక్చువల్ ట్రాప్ లో చిక్కకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశాలను ఆమె సేకరించినట్లుగా తెలుస్తోంది. ఫోటోలు.. రహస్య పత్రాలు.. ఎలక్ట్రానిక్ డేటాను సేకరించిన ఆమె.. ఎన్ క్రిప్టెడ్ కమ్యునికేషన్ ద్వారా తనతో సంప్రదింపులు జరిపే వారికి సమాచరాన్ని అందించినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులోని సున్నితత్వం కారణంగా పలు విషయాల్ని వెల్లడించకుండా పోలీసులు గోప్యతను పాటిస్తున్నారు. ఇంతకు ఆమెను ఎలా ట్రేస్ చేశారన్న విషయానికి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

భారత రక్షణ రంగానికి.. సరిహద్దు వ్యూహాలకు సంబంధించిన కీ వర్డ్స్ తో ఇంటర్నెట్ లో జరిగే ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ లపై కేంద్ర నిఘా సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన కొన్ని ఐపీ అడ్రస్ లు.. అనుమానాస్పద సోషల్ మీడియా ప్రొఫైల్స్ భారత్ లోని ఒకరితో నిరంతరం చాటింగ్ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో అలెర్టు అయిన వారు ఈ చాటింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందన్న విషయాన్ని ట్రేస్ చేశారు. జమ్ముకశ్మీర్ లోని సైనిక స్థావరాలకు సమీపంలో ఉన్న గాంధీనగర్ లోని ఒక ఐపీ అడ్రస్ అన్న విషయాన్ని గుర్తించారు.

తమకు లభించిన ప్రాథమిక సమాచారంతో మరింత లోతుగా వివరాల్ని చెక్ చేశారు. ఇందులో భాగంగా సీనియర్ ఆర్మీ మేజర్ సతీమణి ఈ ఇంటర్నెట్ ను వాడుతున్నట్లుగా గుర్తించారు. ఆమె కార్యకలాపాలపై నిఘా ఉంచిన అధికారులు ఆమెను జమ్ముతావి రైల్వే స్టేషన్ లో ఆమె తన తల్లి.. బిడ్డతో కలిసి ప్రయాణానికి వెళుతున్న వేళలో కేంద్ర నిఘా సంస్థలకు చెందిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్మీ క్యాంప్ నకు తరలించి ప్రాథమికంగా ప్రశ్నించారు. ఆమె మొబైల ఫోన్.. ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా.. ఆమె చైనాకు చెందిన ఏజెంట్లతో మాట్లాడిన విషయాల్ని గుర్తించారు. దీంతో ఆమెపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.