ఉగ్ర తెలివి: ఆసుపత్రులే ఆయుధాగారాలు!
తెలివి-అతి తెలివి.. అనే రెండు విషయాలు మాత్రమే సాధారణంగా అందరికీ తెలుసు. కానీ, ఉగ్ర తెలివి కూడా ఒకటి ఉంటుంది.
By: Garuda Media | 21 Nov 2025 10:00 PM ISTతెలివి-అతి తెలివి.. అనే రెండు విషయాలు మాత్రమే సాధారణంగా అందరికీ తెలుసు. కానీ, ఉగ్ర తెలివి కూడా ఒకటి ఉంటుంది. అదే.. ఇప్పుడు జమ్ము కశ్మీర్ లో వెలుగు చూసింది. ఎవరికీ అనుమానం రాని ప్రాంతాలు కొన్ని ఉంటాయి. దేవాలయాలు.. ఆసుపత్రులు. ఇప్పుడు వీటినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆయుధ సంపత్తిని దాచేందుకు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు సహా జాతీయ దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు.
ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన అనంతరం.. అప్రమత్తమైన పోలీసులు.. పలువురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాల తయారీలో వారు కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు. ఈ క్రమంలో కొందరిని విచారించగా.. ఆసుపత్రుల్లోనే ఆయుధాలు నిల్వ చేయాలన్న కుట్ర చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా వేర్పాటు వాదంతోఉన్న జమ్ము కశ్మీర్‌లో ఈ డంప్‌లు పెట్టాలని నిర్నయించుకున్నట్టు అదుపులో ఉన్న ఉగ్ర వైద్యులు తెలిపారు.
జమ్ము కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని.. ఎక్కడైనా నిల్వ చేస్తే పట్టుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్, బారాముల్లా, శ్రీనగర్‌లలోని ఆసుపత్రుల వద్ద నిల్వ చేయాలని నిర్ణయించుకున్నట్టు నిందితులు తెలిపారు.
దీంతో హుటాహుటిన స్పందించిన అధికారులు.. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిల్వలు ఉన్నాయేమోనన్న కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు ఉగ్ర వైద్యుల కోసం మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన వారితోపాటు.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా.. దర్యాప్తును ముమ్మరం చేయడం గమనార్హం.
