Begin typing your search above and press return to search.

జ‌మిలిపై కేంద్రానిదే నిర్ణ‌య‌మ‌ట‌.. మ‌రి రాష్ట్రాల సంగ‌తేంటి?

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల వ్య‌వ‌హారం గ‌త కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా అసెంబ్లీ, పార్ల‌మెంటుకు వివిధ స‌మ‌యాల్లో కాకుండా.. ఒకే ద‌ఫా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌న్న‌ది ఈ వ్య‌వ‌హారం వెనుక‌ ప్ర‌ధాన ఉద్దేశం.

By:  Garuda Media   |   8 Dec 2025 1:00 PM IST
జ‌మిలిపై కేంద్రానిదే నిర్ణ‌య‌మ‌ట‌.. మ‌రి రాష్ట్రాల సంగ‌తేంటి?
X

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల వ్య‌వ‌హారం గ‌త కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా అసెంబ్లీ, పార్ల‌మెంటుకు వివిధ స‌మ‌యాల్లో కాకుండా.. ఒకే ద‌ఫా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌న్న‌ది ఈ వ్య‌వ‌హారం వెనుక‌ ప్ర‌ధాన ఉద్దేశం. అయితే.. దీనిపై రాష్ట్రాల్లో త‌లోమాట వినిపిస్తోంది. దీనిని ముందు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని చెప్పిన కేంద్రం.. త‌ర్వాత‌.. మాజీ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ సార‌థ్యంలో జ‌మిలిపై క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ రెండేళ్ల‌పాటు అధ్య‌య‌నం చేసి.. కొన్నాళ్ల కింద‌టే నివేదిక కూడా ఇచ్చింది.

ఇక‌, అప్ప‌టి నుంచి జ‌మిలిపై కొన్నాళ్ల పాటు చ‌ర్చ జ‌రిగినా.. 2029 త‌ర్వాతే జ‌మిలి ఉంటుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ఉండ‌బోద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అంతేకాదు.. రాష్ట్రాల అభిప్రాయాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని మ‌రోసారి ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. తాజాగా పార్ల‌మెంటులో త్రిపుర స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చేలా చేసింది. పార్ల‌మెంటులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ''కోవింద్ ఇచ్చిన నివేదిక‌లో.. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. అయినా.. మేం దీనిపై ప‌రిశీల‌న చేస్తున్నాం'' అని అన్నారు.

అయితే.. వాస్త‌వానికి కేంద్రం పైకి చెబుతున్న‌ట్టుగా రాష్ట్రాల అభిప్రాయాల‌ను తీసుకునే ఉద్దేశం లేద‌ని.. కొంద‌రు బీజేపీ ఎంపీలు పార్ల‌మెంటు లాబీల్లో వ్యాఖ్యానించ‌డం దుమారం రేగుతోంది. ''ఇది జాతి ప్ర‌యోజ‌నంతో కూడిన వ్య‌వ‌హారం. దీనిపై కేంద్రం తీసుకునే నిర్ణ‌యమే ఫైన‌ల్‌. రాష్ట్రాల‌తో పెట్టుకుంటే ప‌నిజ‌ర‌గ‌దు'' అని వ్యాఖ్యానించారు. సో..దీనిని బ‌ట్టి కేంద్రం ముందుగా చెప్పిన‌ట్టు రాష్ట్రాల అభ్యంత‌రాల‌ను తీసుకునే అవ‌కాశం.. ఉద్దేశం కూడా లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. దీనిపై జాతీయ‌స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రాల‌కు కూడా కొన్ని హ‌క్కులు ఉంటాయ‌ని కొంద‌రు.. ఎన్నిక‌ల విష‌యంలో కేంద్రానికే హ‌క్కులు ఉంటాయ‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక‌, రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఏడాది(2026) ప‌లు కీల‌క రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి.యూపీ, బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, త్రిపుర స‌హా ప‌లు రాష్ట్రాలు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ 2029లోనే జ‌మిలి వ‌స్తే.. ఈ రాష్ట్రాల్లో అప్ప‌టికి కొత్త ప్ర‌భుత్వాల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంటుంది. దీనికి ఆయా రాష్ట్రాలు ఒప్పుకొంటాయా? అనేది కీల‌క అంశం. దీనికి తోడు ఇప్ప‌టికే బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌లు.. త‌మ అభిప్రాయాలు తీసుకోకుండా జ‌మిలికి ఎలా వెళ్తార‌ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ జ‌మిలి విష‌యంలో రాష్ట్రాల అధికారాల‌ను.. అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక పోతే.. మ‌రో రాజ‌కీయ దుమారం ఖాయం. మొత్తంగా కేంద్రం కోవింద్ క‌మిటీని అడ్డుపెట్టి రాష్ట్రాల అధికారాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న వాద‌న కూడా బ‌ల‌ప‌డుతుండ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.