కేంద్రంతో పాటు . ..22 రాష్ట్రాలకు జమిలి ఎన్నికలు ?
ఇదిలా ఉంటే 2029 నాటికి జమిలి ఎన్నికలు సాధ్యమే అంటూ జమిలి ఎన్నికల మీద నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పీపీ చౌదరి సంకేతాలు ఇస్తున్నారు.
By: Satya P | 24 Aug 2026 9:26 AM ISTదేశంలో జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2019లో ఆ ముచ్చట తీర్చుకోవాలని అనుకుంది. కానీ అపుడు కుదరలేదు, 2024లో అవుతుంది అనుకుంటే అది కూడా అసలు కాలేదు, అయితే 2024 ఎన్నికల కంటే ముందు మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ సారధ్యంలో జమిలి ఎన్నికల మీద ఒక కమిటీని కేంద్రం వేయగలిగింది ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పార్లమెంట్ జేపీసీ ముందు ఉంచింది. ఆ సిఫార్సులు వచ్చిన తర్వాత 2029 లో జమిలి ఎన్నికలతో వెళ్లాలన్నది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం టార్గెట్ గా ఉంది అని అంటున్నారు.
పెద్ద ఎత్తున కసరత్తు :
దేశంలో 1952 తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అపుడు కేంద్రంతో పాటు జమిలిగానే సాగాయి. అదే తీరున 1957, 1962లలో కూడా జరిగాయి. అయితే 1967 లోనే గాడి తప్పింది. అప్పటికి ప్రాంతీయ పార్టీలు రావడం కొత్త పార్టీల ఏర్పాటుతో కాంగ్రెస్ ఏకపక్ష రాజకీయాలకు గండి పడింది. ఆ మీదట నుంచి చూస్తే దేశంలో జమిలి ఎన్నికలు కాదు విడిగానే జరుగుతున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలుగా ఇదే రకమైన ధోరణితో సాగుతోంది. దీని వల్ల ప్రతీ సారీ ఎక్కడో ఒక చోట ఎన్నికలు సాగుతున్నాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అలాగే ఎంతో పెద్ద మొత్తంలో ఎన్నికల ఖర్చు అవుతోందని కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. అందుకే జమిలి ఎన్నికలు అంటోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఒకేసారి ఎన్నికలు జరిపించాలన్నది కేంద్రం ఆలోచన. ఆ దిశగా భారీ కసరత్తు అయితే సాగుతోంది.
మూడొంతుల రాష్ట్రాలతో కలసి :
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ దాని మిత్రుల నుంచి అడ్డంకి వస్తోంది. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోంది. బీజేపీకి దేశంలో సొంతంగా 15 రాష్ట్రాలకు పైగా అధికారం ఉంది. మిత్రులతో కలుపుకుని మరో ఏడు చోట్ల అధికారం అందుకుంటోంది. ఈ లెక్కన 22 రాష్ట్రాలలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. దాంతో తమ రాష్ట్రాలలో జమిలి ఎన్నికల కోసం అప్పటికే ఉన్న ప్రభుత్వాల పాలనను వెనక్కి కానీ ముందుకు కానీ జరుపుకునేందుకు పెద్దగా అభ్యంతరాలు ఉండవని బీజేపీ భావిస్తోంది. దాంతో పాటుగా వీలైతే కాంగ్రెస్ ఇతర పక్షాలతో సంప్రదించాలని కూడా చూస్తోంది అని అంటున్నారు. ఈ మేరకు జమిలి ఎన్నికల మీద ఏర్పాటు అయిన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ పార్టీ అధినేతలతో చర్చలు జరుపుతోంది అని తెలుస్తోంది.
ఇదీ జమిలి పరిస్థితి :
ఇక దేశంలో 22 ఎన్డీయే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాచల ప్రదేశ్, ఒడిషాలలో చాలా కాలంగా లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ జమిలి చట్రంలోకి 18 రాష్ట్రాలను చేర్చాల్సి ఉంది. ఒక జమిలి ఎన్నికలను 2029 లోక్ సభ ఎన్నికలలో అమలు చేయాలనుకుంటే కనుక గోవా, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం గట్టిగా రెండేళ్ళకే ముగుస్తుంది. ఎందుకంటే 2027 లో ఇక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడతాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీల గడువు అయితే నాలుగేళ్ళు తగ్గించాల్సి వస్తుంది. ఇక్కడ 2028లో ఎన్నికలు ఉన్నాయి. అంటే ఎన్నికైన ఏడాదికే మరోసారి జమిలి పేరుతో ఉన్న అసెంబ్లీలను రద్దు చేసుకుని ఎన్నికలకు సిద్ధపడాలి అన్న మాట. ఇక జమిలి చట్రంలోకి వస్తే బీహార్ అసెంబ్లీ కాలం నాలుగేళ్ళకే ముగుస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఆరు నెలల ముందే ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాలు మూడేళ్ళకే అసెంబ్లీ రద్దు చేసుకుని జమిలికి రావాల్సి ఉంటుంది. ఢిల్లీ నాలుగేళ్ళకే అసెంబ్లీ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.
సాధ్యమే అంటూ సంకేతాలు :
ఇదిలా ఉంటే 2029 నాటికి జమిలి ఎన్నికలు సాధ్యమే అంటూ జమిలి ఎన్నికల మీద నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పీపీ చౌదరి సంకేతాలు ఇస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న కసరత్తుని పూర్తి చేసేందుకు తమ కమిటీ కృషి చేస్తోంది అని ఆయన చెప్పారు. తాజాగా గోవాలో జరిగిన ప్యానెల్ సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటిదాకా జరిపిన సంప్రదింపులలో దేశంలో తొంబై శాతం జమిలి ఎన్నికలకు సుముఖంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తరచూ దేశంలో ఎన్నికలు వల్ల ఏకంగా ఏడు లక్షల కోట్ల భారం ప్రభుత్వం మీద పడుతోందని ఆయన అన్నారు ఈ ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఇందులో ఉందని అన్న్నారు. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికల చట్రంలో మొదటి దశలో ఎన్డీయే పాలిత రాష్ట్రాలే ఉంటాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల ఆధీనంలో ఉండే రాష్ట్రాలలో అసెంబ్లీల గడువు అయిదేళ్ళూ ఉంటుంది. రెండవ దశలో వాటిని కలుపుతారు అని అంటున్నారు. మొత్తానికి 2029 ఎన్నికలు జమిలి విధానంలో జరుగుతాయని అంటున్నారు.
