Begin typing your search above and press return to search.

రూ. 500 ఎంట్రీ ఫీజుతో జైష్-ఎ-మొహమ్మద్ లోకి.. కొత్త కుట్రకు తెర..

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మొహమ్మద్’ (JeM) తన చీకటి కార్యకలాపాలను మరోసారి తెర ముందకు తెచ్చింది.

By:  Tupaki Political Desk   |   22 Oct 2025 3:22 PM IST
రూ. 500 ఎంట్రీ ఫీజుతో జైష్-ఎ-మొహమ్మద్ లోకి.. కొత్త కుట్రకు తెర..
X

పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మొహమ్మద్’ (JeM) తన చీకటి కార్యకలాపాలను మరోసారి తెర ముందకు తెచ్చింది. ఈ సారి, మహిళలను లక్ష్యంగా చేసుకొని ‘జమాత్ ఉల్-ముమినాత్’ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. విమెన్ వింగ్ ప్రారంభిస్తున్నట్లు జేషే అక్టోబర్ 8వ తేదీనే ప్రకటించింది. ఇప్పుడు ఆన్‌లైన్ ‘జిహాదీ కోర్సు’ ప్రారంభించింది. ఈ కోర్సు, ‘తుఫత్ అల్-ముమినాత్’ పేరుతో, జెఎమ్ అధినేత మసూద్ అజ్హర్ సోదరీమణులు సాదియా, సమైరా నేతృత్వంలో కొనసాగుతుంది. రోజుకు 40 నిమిషాల పాటు వీరికి జీహాదీ విద్య బోధిస్తారు. 500 పాకిస్తానీ రూపాయల డొనేషన్‌తో ఈ కార్యక్రమం ఉగ్రవాదానికి మహిళలను రిక్రూట్ చేసే కొత్త వ్యూహంగా మారింది. ఈ కుట్ర భారతదేశం, ప్రపంచ భద్రతకు సవాలుగా మారుబోతోంది.

కొత్త వ్యూహం.. మహిళల రిక్రూట్‌మెంట్

జైష్ చరిత్రలో మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ఆకర్షించడం ఇదే మొదటిసారి. మసూద్ అజ్హర్ అంతర్జాతీయ ఉగ్రవాది, తన సోదరీమణులైన సాదియా, సమైరాను ఈ కార్యక్రమానికి ప్రధాన నాయకురాళ్లుగా నియమించాడు. సాదియా జైష్ మహిళా విభాగానికి కమాండర్‌గా, ఆన్‌లైన్ పాఠాలను నిర్వహిస్తుంది. ఈ కోర్సులో జిహాద్, ఇస్లామిక్ దృక్పథంలో మహిళల పాత్రల గురించి బోధిస్తారు. కానీ ఈ పాఠాల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం మహిళలను రాడికలైజ్ చేసి, సూసైడ్ బాంబర్లుగా, మార్చడమే. ఈ కోర్సు కోసం రూ. 500 పాక్ కరెన్సీని డొనేషన్ గా వసూలు చేయనున్నారు. దీని ద్వారా జైష్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను సైతం సమీకరించుకుంటోంది. ఈ ఆర్థిక వ్యవస్థ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సౌలభ్యం, మహిళలను రహస్యంగా రిక్రూట్ చేయడానికి దోహదం చేస్తుంది.

మహిళలే ఎందుకు..?

భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో జైష్ బలాన్ని గణనీయంగా దెబ్బతీసింది. హెడ్‌క్వార్టర్లను ధ్వంసం చేయడంతో పాటు కమాండర్లను సైతం హతమార్చింది. దీంతో జైష్ చాలా వరకు నష్టపోయింది. ఈ నేపథ్యంలో.. మహిళలను రిక్రూట్ చేయడం ద్వారా తమ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావలాకోట్‌లో అక్టోబర్ 19న జరిగిన ‘దుఖ్తరాన్-ఎ-ఇస్లాం’ కార్యక్రమం ఈ రిక్రూట్‌మెంట్‌కు నాంది పలికింది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, జైష్ కమాండర్ల భార్యలు ఈ కార్యక్రమంలో ప్రధాన లక్ష్యాలు. ఇది ఐసిస్, ఎల్‌టీటీ వంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ కుట్ర దేశానికి.. ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారబోతోంది. 2019 పుల్వామా దాడి.. ఇతర జైష్ దాడులు ఇప్పటికే విధ్వంసాన్ని చూశాయి. మహిళలను రిక్రూట్ చేయడం వల్ల దాడులు మరింత రహస్యంగా మారుతాయి. గుర్తించడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రాడికలైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా యువతను, ముఖ్యంగా మహిళలను ఆకర్షించడం సులభం అవుతుంది. పాకిస్తాన్‌లో ఆర్థిక సమస్యలు, లింగ వివక్ష ఈ రిక్రూట్‌మెంట్‌కు మట్టి అవుతున్నాయి. జైష్ ఈ బలహీనతలను ఉపయోగించుకుంటూ, ‘కాశ్మీర్ స్వాతంత్ర్యం’ అనే మాయమాటలతో మహిళలను మోసం చేస్తోంది.

ఈ కుట్రను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు అవసరం. భారత భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా గమనించాలి. ఐక్యరాష్ట్ర సంఘం, ఇంటర్‌పోల్ ఈ కోర్సులను ట్రాక్ చేసి, జైష్ నిధుల సేకరణను అడ్డుకోవాలి. పాకిస్తాన్‌లో రాడికలైజేషన్ కార్యక్రమాలు.. మహిళల ఆర్థిక సాధికారత పథకాలు అవసరం. భారత్‌లో సైబర్ సెక్యూరిటీ, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు బలోపేతం కావాలి. సర్జికల్ స్ట్రైకులు, బాలకోట్ దాడులు జైష్ కు గట్టి హెచ్చరికలు, కానీ ఈ డిజిటల్ యుగంలో సైబర్ యుద్ధం కూడా కీలకం.

జైష్-ఎ-మొహమ్మద్ ఈ కొత్త వ్యూహం ఉగ్రవాదం డిజిటల్ పరిణామాన్ని చూపిస్తుంది. మహిళలను రాడికలైజ్ చేయడం.. నిధుల సేకరణకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగించడం ద్వారా జైష్ తన ప్రమాదకర ఆలోచనలను విస్తరిస్తోంది. ఇది కేవలం దేశ సమస్య కాదు.. ప్రపంచవ్యాప్త భద్రతకు సవాలు. ఐక్యత, జాగ్రత్త, సమర్థవంతమైన వ్యూహాలతో మాత్రమే ఈ ముప్పును అడ్డుకోవచ్చు. ఉగ్రవాదం మతం, లింగం (ఆడ, మగ) చూడదు. అది మానవత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ చీకటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రతి ఒక్క దేశం బాధ్యతగా మారాలి.