Begin typing your search above and press return to search.

జక్కంపూడి ఫైర్ బ్రాండ్ కి టికెట్ ఎక్కడ ?

జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లాలలో కీలక నాయకుడు. ఆయన కాంగ్రెస్ లో మూడు దశాబ్దాల పాటు రాజకీయ అనుబంధం పెనవేసుకున్న నేత.

By:  Satya P   |   21 July 2026 9:54 AM IST
జక్కంపూడి ఫైర్ బ్రాండ్ కి టికెట్ ఎక్కడ ?
X

జక్కంపూడి రామ్మోహన్ రావు తూర్పు గోదావరి జిల్లాలలో కీలక నాయకుడు. ఆయన కాంగ్రెస్ లో మూడు దశాబ్దాల పాటు రాజకీయ అనుబంధం పెనవేసుకున్న నేత. కడియం అసెంబ్లీ సీటు నుంచి తొలిసారి 1989లో గెలిచిన జక్కంపూడి 1994లో ఓడినా తిరిగి 1999, 2004లో గెలిచారు. ఇక ఆయన 2004 నుంచి 2009 దాకా వైఎస్సార్ మంత్రివర్గంలో రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల మంత్రిగా పని చేశారు. వైసీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన అందులో పనిచేశారు. వైసీపీ స్థాపించిన ఎనిమిది నెలలకు ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ వైసీపీలో కీలకంగా ఉన్నారు. రాజా అయితే రాజానగరం నుంచి 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇక జక్కంపూడి గణేష్ వైసీపీలో అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఫైర్ చూపించిన గణేష్ :

జక్కంపూడి రాజాయే ఫైర్ బ్రాండ్ అనుకుంటే ఆయనను మించిన వారు గణేష్ అని అంటారు. అన్నకు తోడుగా ఉంటూ రాజకీయాల్లో దూకుడుగా ఉంటే గణేష్ తాను కూడా పోటీకి తయారుగా ఉన్నట్లుగా గతంలోనే సంకేతాలు ఇచ్చారు. ఇక తాజాగా ముద్రగడ పద్మనాభం, జీఎస్ రావుల సంస్కరణ సభ రాజమండ్రిలో జరిగింది. ఈ సభలో రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సభలో జక్కంపూడి గణేష్ ఫైర్ బ్రాండ్ స్పీచ్ ఇచ్చారు. తాను ముద్రగడ అనుచరుడిని అన్నారు. ముద్రగడ ఆశయాల కోసం పాటు పడతామని గట్టిగా చెప్పారు. ఆయన స్పీచ్ అయితే అందరినీ ఆకట్టుకుంది. గణేష్ రాజకీయంగా చురుకుగా ఉంటున్న సంగతి విధితమే.

సీటు కోరుతారా :

వైసీపీలో గణేష్ కూడా కీలకంగానే ఉంటున్నారు. అయితే రాజానగరం ఇంచార్జిగా రాజా ఉన్నారు. గణేష్ కూడా ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఆయనకు ఎక్కడ సీటు ఇస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. వైసీపీలో ఇలా కుటుంబాలకు సీటు ఇవ్వడం అంటే తక్కువగానే ఉంటుంది.కొందరికే ఆ మినహాయింపు ఉంది. అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే వైఎస్సార్ ఫ్యామిలీకి ప్రత్యేక అభిమానం ఉంది. జగన్ స్థాపించిన పార్టీలో పునాదుల నుంచి ఉన్న వారు జక్కంపూడి. దాంతో పాటు తొలి ఎన్నికల్లో విజయలక్ష్మికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఆమె స్వల్ప తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. 2019లో రాజా గెలిచారు. ఇక ఆ నియోజకవర్గం వారి సొంతం. అయితే దానితో పాటు మరో సీటు అంటే కడియం అసెంబ్లీ ఉంది.

ఆ సీటు మీద ఫోకస్ :

తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మూడు సార్లు గెలిచిన కడియం సీటు ఇపుడు లేదు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఈ సీటు దీని స్థానంలో రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ వైసీపీ ఇంచార్జిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఉంటున్నారు. ఆయన వేరే ప్రాంతం నుంచి బదిలీ అయి వచ్చారు. పైగా ఈ సీటు టీడీపీకి కంచుకోట. మరి ఇక్కడ బలమైన సామాజిక వర్గం అండ కూడా దక్కుతుందన్న ఆలోచనలతో ఈ సీటు మీద జక్కంపూడి వారసుడు కన్ను వేశారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా యువతకు ఎక్కువగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్న క్రమంలో జక్కంపూడి గణేష్ కూడా ఎన్నికల బరిలోకి దిగుతారా అన్న చర్చ సాగుతోంది.