యూఎన్ చీఫ్ ను కలవడానికి కారులో 670 కి.మీల ప్రయాణం.. అమెరికాలో జైశంకర్ సాహసం
అమెరికాలో షట్ డౌన్ లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఇబ్బందులు తప్పవు. అలాంటిదే భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ కు ఎదురైంది.
By: A.N.Kumar | 9 Jan 2026 12:48 PM ISTఅమెరికాలో షట్ డౌన్ లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఇబ్బందులు తప్పవు. అలాంటిదే భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్ కు ఎదురైంది. ఆయన యూఎన్ చీఫ్ ను నిర్ణీత సమయంలో కలవాలి. కానీ అమెరికాలో షట్ డౌన్ విధించారు. ఫలితంగా విమాన ప్రయాణం కుదరదు. దీంతో దాదాపు 670 కిలో మీటర్లు కారులో ప్రయాణించాలి. అది కూడా గడ్డకట్టే చలిలో. ఇలాంటి ప్రయాణం ఒక విదేశాంగ మంత్రికి చాలా ప్రమాదం. కానీ యూఎన్ చీఫ్ ను ఖచ్చితంగా కలవాలి. దీంతో అమెరికా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను గమ్యస్థానానికి చేర్చారు. ఈ ఆపరేషన్ వివరాలను యూస్ డిప్లొమాటిక్ సెక్యురిటీ సర్వీస్ వెల్లడించింది.
షట్ డౌన్ ఎందుకు ?
అమెరికన్ కాంగ్రెస్ ఆదేశంలో నిధుల వినియోగానికి తగిన సమయంలో ఆమోదం తెలపడం ఆలస్యమైతే .. ప్రభుత్వానికి నిధులు వినియోగించుకునే అధికారం ఉండదు. అప్పుడు నిధుల కొరతతో అత్యవసరం కాని వ్యవహారాలు ఆగిపోతాయి. దీనిని షట్ డౌన్ అంటారు. దాదాపు 1976 నుంచి ఇప్పటి వరకు 10 షట్ డౌన్లు విధించినట్టు తెలుస్తోంది.
హింట్ ఇచ్చిన కుక్క ..
అమెరికా షట్ డౌన్ విధించిన సందర్భంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా- కెనడా సరిహద్దులోని లెవిస్టన్ -క్వీన్ స్టన్ వంతెన వద్ద ఉన్నారు. అక్కడ నుంచి న్యూయార్క్ చేరుకోవడం తప్పనిసరి. కానీ షట్ డౌన్ విధించారు. విమానాలు నడవవు. దీంతో గత్యంతరం లేక కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ కు దాదాపు 27 మంది భద్రతా ఏజెంట్లను నియమించారు. యూఎస్ భద్రతా ఏజెంట్లతో కలిసి జైశంకర్ కారు ప్రయాణం ప్రారంభించారు. కొద్దిదూరం వెళ్లాక పోలీసులు భద్రతా తనిఖీలు చేపట్టారు. పోలీస్ కుక్క జైశంకర్ కారును చూసి మొరిగింది. వెంటనే యూఎస్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాన్నీ తమ ఆధీనంలోకి తీసుకుని పరీక్షించారు. కానీ అది తప్పుడు సంకేతమని తేలింది. దీంతో ఊపిరిపీల్చుకున్నారు.
గడ్డ కట్టే చలిలో ప్రయాణం..
తనిఖీల తర్వాత జయశంకర్ ప్రయాణం మొదలైంది. న్యూయార్క్ వైపు సాగుతోంది. ఒకవైపు గడ్డ కట్టే చలి. మరోవైపు మంచు కురుస్తోంది. ఆగకుండా కారు ప్రయాణిస్తోంది. యూఎన్ చీఫ్ ను కలవడం లక్ష్యం. వీటన్నింటినీ లెక్కచేయకుండా జైశంకర్ ప్రయాణించారు. డ్రైవర్లు మారుతూ.. దాదాపు ఏకధాటిగా ఏడు గంటలు కారు నడిపారు. జైశంకర్ అంతిమంగా గమ్యస్థానం చేరుకున్నారు. యూఎన్ చీఫ్ ను కలిశారు. దాదాపు రెండు గంటలు చర్చించారు.
న్యూయార్క్ లో అడుగుపెట్టాక యాక్సిడెంట్ ..
జైశంకర్ ను తీసుకుని యూఎస్ భద్రతా సిబ్భంది న్యూయార్క్ వచ్చింది. న్యూయార్క్ నగరంలోకి అడుగుపెట్టాక దారిలో హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేస్ ఎదురైంది. ఒకవైపు జైశంకర్ భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా వ్యవహరిస్తూ.. యాక్సిడెంట్ అయిన వ్యక్తికి సహాయం అందించింది యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది. అంతటి సీరియస్ పరిస్థితిలోనూ మానవత్వాన్ని చాటుకుంది.
