Begin typing your search above and press return to search.

అమెరికా 'డబుల్ గేమ్' పై ఇచ్చిపడేసిన జై శంకర్

ఆసియాన్‌ సదస్సు ముగిసిన అనంతరం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంధన సరఫరా గొలుసులు, గ్లోబల్‌ మార్కెట్‌లోని అస్థిరతపై చర్చ జరిగింది.

By:  A.N.Kumar   |   27 Oct 2025 11:32 PM IST
అమెరికా డబుల్ గేమ్ పై ఇచ్చిపడేసిన జై శంకర్
X

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అమెరికా అనుసరిస్తున్న ‘డబుల్ గేమ్’ (ద్వంద్వ నీతి) పై భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ మరోసారి సూటిగా, ఘాటుగా స్పందించారు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా తీసుకుంటున్న ఎంపికాత్మక వైఖరిని (సెలక్టివ్ అప్రోచ్) ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై భారత దౌత్యానికి కొత్త గంభీరతను తెచ్చాయి.

నీతులు చెప్పేవారి 'భిన్న' ఆచరణ

ఆసియాన్‌ సదస్సులో మాట్లాడిన జైశంకర్‌, పశ్చిమ దేశాల నైతిక ప్రమాణాలపై పదునైన విమర్శలు చేశారు. "నీతులు చెప్పేవారు ఆచరణలో మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాన కారణం రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌పై విధించిన 25 శాతం సుంకం.

అదే సమయంలో రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న చైనా, యూరప్‌ దేశాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలను స్పష్టం చేసింది. "ఇది న్యాయం కాదు. ఒక్కో దేశానికి ఒక్కో నిబంధన వర్తింపజేయడం సరైంది కాదు" అని జైశంకర్‌ పశ్చిమ దేశాల ఎంపికాత్మక ధోరణిని ఎండగట్టారు.

జాతీయ ప్రయోజనాలే ముఖ్యం: స్పష్టం చేసిన భారత్

ఆసియాన్‌ సదస్సు ముగిసిన అనంతరం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇంధన సరఫరా గొలుసులు, గ్లోబల్‌ మార్కెట్‌లోని అస్థిరతపై చర్చ జరిగింది. ప్రపంచంలో నెలకొన్న అస్థిరతను ప్రస్తావిస్తూ జైశంకర్‌ కీలక వ్యాఖ్య చేశారు. "ఓ వైపు సరఫరా గొలుసులు క్షీణిస్తున్నాయి, మరోవైపు ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడం సహజం." అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచం టెక్నాలజీ, సహజ వనరుల కోసం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని జైశంకర్‌ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో నైతికత పేరుతో కొందరిపై మాత్రమే ఆంక్షలు విధించడం, ఇతరులను విడిచిపెట్టడం అంతర్జాతీయ సమానతకు విరుద్ధంగా ఆయన అభివర్ణించారు.

స్వతంత్ర విదేశాంగ విధానానికే కట్టుబడి

జైశంకర్‌ వ్యాఖ్యలు అమెరికా ద్వంద్వ నీతిని బహిర్గతం చేయడమే కాకుండా, భారత్‌ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించబోతుందనే బలమైన సంకేతాన్ని ఇచ్చాయి. “ప్రపంచం బహుళ ధ్రువాల దిశగా సాగుతోంది. ఎవరి ప్రయోజనాలకోసం భారత నిర్ణయాలు తీసుకోదు” అని ఆయన స్పష్టంచేశారు.

మొత్తంమీద, ఇంధన రాజకీయాల్లో అమెరికా రెండు మాస్టర్లు వహిస్తోందనేది జైశంకర్‌ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఒకవైపు నియమ నిబంధనలు రాసి మరొకవైపు వాటినే ఉల్లంఘిస్తున్న వైఖరిని ప్రపంచ వేదికపై ప్రశ్నించడం ద్వారా భారత్‌ దౌత్యపరంగా తన సొంత స్థానాన్ని, నిర్ణయాధికారాన్ని ధైర్యంగా ప్రకటించింది.