పాకిస్తాన్ జర్నలిస్ట్ కు ఇచ్చిపడేసిన జైశంకర్.. దెబ్బకు నోరు మూతపడింది..
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రదర్శించే విన్యాసాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.
By: A.N.Kumar | 26 Sept 2026 12:45 PM ISTఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రదర్శించే విన్యాసాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ప్రతిసారీ సరికొత్త వ్యూహంతో వస్తున్నామని అనుకుంటారు.. తీరా వచ్చాక భారత దౌత్యవేత్తల చేతిలో ఘోరంగా బుక్కవుతారు. తాజాగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో కూడా సరిగ్గా ఇదే రకమైన హాస్య సన్నివేశం ఒకటి పునరావృతమైంది.
న్యూయార్క్‌లో లైబీరియా విదేశాంగ మంత్రితో కలిసి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్య నౌకలు, నావికుల భద్రత వంటి అత్యంత తీవ్రమైన, బాధ్యతాయుతమైన అంశాలపై ప్రసంగాలు ముగిశాయి. సరిగ్గా అదే సమయంలో తన ఉనికిని చాటుకోవాలని ఆరాటపడిన ఒక పాకిస్థాన్ జర్నలిస్ట్ రంగంలోకి దిగాడు. ఏమాత్రం హోంవర్క్ లేకుండా తర్కానికి అందని ఒక విచిత్రమైన ప్రశ్నేశాడు.
"పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని మీ ప్రభుత్వం ఎప్పుడు ఆపుతుంది?" అంటూ భారత్‌పై ఎదురుదాడికి ప్రయత్నించాడు. ప్రపంచమంతా ఏ దేశం ఉగ్రవాదానికి నర్సరీయో బాగా తెలుసు. అలాంటిది 'ఆవు కథ' తెచ్చి ఎక్కడో రుద్దాలని చూసిన ఆ జర్నలిస్ట్ అమాయకత్వానికి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే ఎదురుగా ఉన్నది ఎస్. జైశంకర్.. అనవసర ఉపన్యాసాలు ఇవ్వడం ఆయన శైలి కానే కాదు. ఒక్క ముక్కలో.. అత్యంత సీరియస్ లుక్ ఇస్తూ జైశంకర్ ఇచ్చిన కౌంటర్ దెబ్బకు ఆ జర్నలిస్ట్ నోరు ఎప్పటికీ తెరుచుకోనంతగా మూతపడింది. “ఓ టెర్రరిస్ట్ కంట్రీ నన్ను ఆ ప్రశ్న అడుగుతోందా? కమాన్!” ఈ ఒక్క డైలాగ్‌తో ఆ పాక్ జర్నలిస్ట్ వేసిన ప్లాన్ మొత్తం తలకిందులైంది. "అయ్యా! మీ దేశం చరిత్ర ఏమిటో మీ ఊరు అడ్రస్ ఏమిటో లోకమంతటికీ తెలుసు.. అలాంటిది నన్నే ప్రశ్నిస్తున్నారా?" అనే రేంజ్‌లో జైశంకర్ ఇచ్చిన రిప్లైకి ఆడిటోరియంలోని దౌత్యవేత్తలు, ఇతర మీడియా ప్రతినిధులు సైలెంట్ అయిపోయారు.
ఒక్క రోజు ముందు ప్రధాని షెహబాజ్.. మరుసటి రోజు జర్నలిస్ట్!
నిజానికి ఈ డ్రామా వెనుక చిన్న ఫ్లాష్‌బ్యాక్ ఉంది. దీనికి ఒక్క రోజు ముందే ఐరాస భవనంలోకి వెళ్తున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఓ భారతీయ జర్నలిస్ట్ పట్టుకుని "ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?" అని నేరుగా అడిగేశారు. దానికి షెహబాజ్ గారు బదులివ్వలేక సైలెంట్‌గా తలదించుకుని కాళ్లకు బుద్ధి చెప్పారు.
ఆ పరాభవానికి రివేంజ్ తీర్చుకుందామని పాక్ జర్నలిస్ట్ జైశంకర్‌పై ప్రయోగానికి దిగాడు. కానీ పాక్ ప్రధాని లాగా పారిపోవడం జైశంకర్‌కు అలవాటు లేదుగా.. తిప్పికొట్టడంలో ఆయన వేసే దెబ్బ ఎలా ఉంటుందో ఈ ఒక్క సంఘటనతో ఆ జర్నలిస్ట్‌కు బాగా అర్థమై ఉంటుంది.
పాకిస్థాన్ మీడియా ఇకనైనా గ్రహించాల్సింది ఏమిటంటే భారత విదేశాంగ మంత్రితో పెట్టుకునేటప్పుడు ప్రశ్నలతో పాటు కాస్త దౌత్యపరమైన పరిజ్ఞానాన్ని కూడా వెంట తెచ్చుకుంటే మంచిది.. లేదంటే ఇలాంటి 'వన్-లైనర్' దెబ్బలతో సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారడం ఖాయం..
