Begin typing your search above and press return to search.

అమెరికాకు చెక్ పెట్టేలా ‘గ్లోబల్ సౌత్’ వైపు భారత్ అడుగులు

అమెరికా వాణిజ్య విధానాలపై పరోక్షంగా చెక్ పెట్టేలా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   25 Sept 2025 5:00 AM IST
అమెరికాకు చెక్ పెట్టేలా ‘గ్లోబల్ సౌత్’ వైపు భారత్ అడుగులు
X

అమెరికా వాణిజ్య విధానాలపై పరోక్షంగా చెక్ పెట్టేలా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ఒకే మార్కెట్‌, ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలను సృష్టించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 80వ సెషన్‌లో భాగంగా జరిగిన దక్షిణాది దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో జైశంకర్‌ మాట్లాడారు.

గ్లోబల్‌ సౌత్‌ సవాళ్లు

జైశంకర్‌ మాట్లాడుతూ “మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా బయటపడక ముందే ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, గాజా సంక్షోభం, ప్రతికూల వాతావరణ సంఘటనలు, అస్థిర వాణిజ్య పరిస్థితులు, పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు.. ఇవన్నీ గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశాయి” అని పేర్కొన్నారు. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు గణనీయంగా వెనుకబడి పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

బహుపాక్షికతపై ఆందోళన

ప్రపంచ దేశాలు బహుపాక్షికత వైపు చూడాల్సిన అవసరం ఉందని జైశంకర్‌ గుర్తుచేశారు. అయితే అంతర్జాతీయ సంస్థలు నిరుపయోగంగా మారడం, వనరుల కొరత, సంస్కరణల ఆలస్యంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయన్నారు. “సంస్కరణలు లేకపోవడం వల్ల మేము భారీ మూల్యం చెల్లిస్తున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణాది దేశాల ఐక్యతే మార్గం

ఈ సవాళ్లను ఎదుర్కొనే మార్గం గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఐక్యతలోనే ఉందని జైశంకర్‌ స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలను అనుసరించడం, దక్షిణాది దేశాల మధ్య వాణిజ్యం పెంచుకోవడం, సాంకేతిక సహకారం విస్తరించుకోవడం ఎంతో కీలకమని ఆయన సూచించారు.

భారత్‌ సంకేతం

జైశంకర్‌ వ్యాఖ్యలు అమెరికా వాణిజ్య విధానాలకు స్పష్టమైన సంకేతాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. టారిఫ్‌లతో ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని భారత్‌ గ్లోబల్‌ సౌత్‌ దేశాలను పిలుపునివ్వడం ప్రత్యేకంగా గమనార్హం.

మొత్తం మీద అమెరికా ఆధారాన్ని తగ్గించి గ్లోబల్‌ సౌత్‌ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక సహకారం పెంపొందించడం ద్వారా స్థిరత్వాన్ని సాధించాలన్నది జైశంకర్‌ సందేశం.