జైలు హుషార్...అంబటి మినిస్టర్
జైలు సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాలకు బాగా అచ్చి వస్తోంది. జైలుకు వెళ్తే చాలు అధికారం ఖాయం అన్నది బాగా బలపడిపోయింది.
By: Satya P | 21 Feb 2026 9:21 AM ISTజైలు సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాలకు బాగా అచ్చి వస్తోంది. జైలుకు వెళ్తే చాలు అధికారం ఖాయం అన్నది బాగా బలపడిపోయింది. గత రెండు దశాబ్దాలుగా అదే జరుగుతూ వస్తోంది. అలా ముఖ్యమంత్రులు అయిన వారు కళ్ల ముందే ఉన్నారు. మరి ఆ జాబితాలో తానూ ఉన్నారు అంటున్నారు వైసీపీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు. ఆయన తాజాగా రాజమండ్రి జైలులో పద్దెనిమిది రోజుల పాటు ఉండి వచ్చారు. దాంతో ఆయన మీడియా మీట్ పెడుతూ తెగ జోరు చేస్తున్నారు. తన జైలు జీవితాన్ని అనుభవాలని ఆయన మీడియాకు వివరిస్తూ కూటమి మీద మూడో కన్నే తెరుస్తున్నారు. అదే సమయంలో తనకు జైలు సినిమా చూపించారు కానీ తాను హీరోని సుమా అని అంటూ విలన్లు ఎవరు అని మిలియన్ డాలర్ల ప్రశ్నను సంధిస్తున్నారు.
పోలీసులు కొట్టబోయారు :
ఇక నల్లపాడు పోలీసు స్టేషన్ లో పోలీసులు తనను కొట్టబోయారు అని అంబటి రాంబాబు చెప్పారు. స్టేషన్ లో సీఐ ఎస్సై కానిస్టేబుళ్ళు తన రెండు కాళ్ళు బార చాపమని ఆ మీదట కొట్టడానికి ఉపక్రమించారని అయితే తాను మాజీ మంత్రిని అని మళ్ళీ మంత్రిని అవుతాను అని ఇంతకు ఇంత వడ్డీతో తీరుస్తాను అని చెప్పడంతో వారు ఏమాలోచించుకున్నారో వెనక్కి తగ్గిపోయారని అంబటి సంచలన విషయాలు చెప్పారు. తాను అబద్ధం చెప్పడం లేదని సీఐ ఎస్సైల మీద తాను ఎందుకు ఊరకే నిందలు వేస్తాను అని ఆయన అంటూ ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను అని అన్నారు.
మినిస్టర్ అంటూ :
ఇవన్నీ పక్కన పెడితే అంబటి ఈ ఫ్లోలో చెప్పిన మాట మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను అని. అంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్న అంబటి ముందే తన కేబినెట్ బెర్త్ ని ఖాయం చేసుకున్నారా అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే 2029 లో అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది అయితే జైలుకు వెళ్ళకముందు అంబటి మీడియా మీటింగ్స్ ఎన్ని పెట్టినా ఇంతలా ఫోకస్ అయితే లేదు, కానీ దాడి తరువాత ఒక్కసారిగా అంబటి మీద మీడియా ఫేస్ అయితే పడుతోంది. దాంతో మీడియా ముందు ఎపుడూ ఎక్కువగా సందడి చేసే అంబటి జైలుకి వెళ్ళి వచ్చిన తరువాత మరింత హుషారుగా మాట్లాడుతున్నారు. ఆ జోరులో మినిస్టర్ అంబటి అని కూడా చెప్పేసుకుంటున్నారు అని అంటున్నారు.
టికెట్ ఖాయమా :
ఇదిలా ఉంటే అంబటికి వైసీపీ మూడు సార్లు సత్తెనపల్లి అసెంబ్లీ సీటు ఇస్తే ఒక్కసారి గెలిచారు. ఇక అక్కడ నుంచి ఆయన్ని గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. దాంతో 2026 సంక్రాంతి సంబరాలను అక్కడే ఆయన జరుపుకున్నారు. అయితే అంబటిని ఇంచార్జిగా చేసినా సీటు వస్తుందా రాదా అన్నది గతంలో ఉండేది. ఇపుడు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన అంబటికి ఇమేజ్ పెరిగింది అని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో ఆయనకు సీటు పక్కా అని అంటున్నారు. ఇక కాపు సామాజిక వర్గం బిడ్డ అని పులి అని అంబటి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు 2029 లో అన్నీ కలసి వచ్చి అంబటి గెలుస్తారు అని అంటున్నారు. అంబటి అయితే తాను మరోసారి మంత్రిని అవుతాను అని పోలీసులకు హెచ్చరించాను అని చెప్పాను అన్నారు. అంటే మళ్ళీ మంత్రి కావాలని అంబటి కోరుకుంటున్నారు అని అంటున్నారు. ఏమో జైలు సెంటిమెంట్ అందరికీ బాగానే పండింది. అంబటి వర్గీయులు అదే నమ్ముకుంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో. మొత్తానికి జగన్ కేబినెట్ అన్నది ఫిక్స్ అయిపోయి అంబటి బెర్త్ రిజర్వ్ ఔయిపోయిందా అన్నదే చర్చగా సాగుతోందిపుడు.
