రఘురామ నోటికి తాళం! రంగంలోకి దిగిన రాష్ట్రపతి కార్యాలయం?
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఫైర్ బ్రాండ్ లీడర్ రఘురామరాజు నోటికి తాళం పడనుందా? అనే చర్చ మొదలైంది.
By: Tupaki Political Desk | 8 Jan 2026 6:03 PM ISTఏపీ డిప్యూటీ స్పీకర్, ఫైర్ బ్రాండ్ లీడర్ రఘురామరాజు నోటికి తాళం పడనుందా? అనే చర్చ మొదలైంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ ఆయన రాజకీయ విమర్శలు చేయడం, టీవీ, యూట్యూబ్ డిబేట్లలో ప్రతిపక్ష నేతలను విమర్శించడాన్ని తప్పుపడుతూ జైభీం పార్టీ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్రపతి కార్యాలయం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి దృష్టికి రఘురామ వ్యవహారం వెళ్లడం ఒక సంచలనమైతే, రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాయడం అంతకు మించి సంచలనంగా మారిందనే చర్చ జరుగుతోంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు రాజ్యాంగ పదవిలో ఉంటూ టీవీ చర్చల్లో పాల్గొంటున్నారని జైభీమ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రాష్ట్రపతి కార్యాలయం సీఎస్ విజయానంద్ కు తాజాగా లేఖ రాసింది. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ తాము కోర్టులో పిటిషన్ కూడా వేయనున్నామని, ఆయన ఆ పదవికి తగరని ఫిర్యాదు చేయనున్నామని జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ప్రకటించారు.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవుల్లో ఉన్న వారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని జడ శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. ఆ పదవులకు ఎన్నికైన సందర్భంగానే తమ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయాల్సివుందని నిబంధనలు చెబుతున్నాయని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కానీ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ విపక్షంపై విమర్శలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారని శ్రవణ్ కుమార్ తెలిపారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించడాన్ని ఆయన స్వాగతించారు.
కాగా, ఏపీ రాజకీయాల్లో తాజా పరిణామం విస్తృత చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామరాజు మంత్రి పదవిని ఆశించారు. అయితే ఆయన నోటికి భయపడే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారని, ఆ పదవి వల్ల ఆయన రాజకీయంగా విమర్శలు, ఇతర కార్యకలాపాలను నిరోధించవచ్చని కూటమి నేతలు భావించారని అంటున్నారు. అదే సమయంలో సభాధ్యక్ష స్థానంలో రఘురామను చూడటం విపక్ష నేత జగన్ రెడ్డికి ఇబ్బందిగా ఉంటుందని, ఇది రాజకీయంగా తమకు లాభిస్తుందని కూటమి నేతలు అంచనా వేసినట్లు చెబుతున్నారు.
అయితే, కూటమి నేతలు ఊహించింది ఒకటైతే, రఘురామరాజు వ్యవహారశైలి మరోలా ఉందని అంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన రఘురామరాజు స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించి అప్పట్లో రాజకీయ సంచలనంగా మారారు. ఆయనపై గత ప్రభుత్వంలో రాజద్రోహం కేసు నమోదు చేయడం, ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై రఘురామ ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ మీడియాలో ప్రత్యేక వ్యాఖ్యానాలు చేస్తున్నారని విపక్షం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ విషయంలో వైసీపీ నేరుగా కల్పించుకోకుండా, తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న దళిత నేత, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ద్వారా ఆయనకు చెందిన పార్టీ తరఫున ఫిర్యాదు చేయించడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
