పీరియడ్స్ డేట్ అడిగేవాడు.. కోచ్ పై మహిళా క్రికెటర్ సంచలన ఆరోపణ
క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆ ఆటలో ప్రతిభ, క్రమశిక్షణ, నిబద్ధతతో కూడిన క్రీడాస్ఫూర్తి ఉండాలి.
By: A.N.Kumar | 8 Nov 2025 6:00 AM ISTక్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆ ఆటలో ప్రతిభ, క్రమశిక్షణ, నిబద్ధతతో కూడిన క్రీడాస్ఫూర్తి ఉండాలి. అయితే కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల ఈ ఆట పైనే మచ్చ పడుతోంది. ముఖ్యంగా మహిళా క్రికెట్‌లో కొన్ని కోచ్‌లు చూపిస్తున్న అనుచిత ప్రవర్తన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.
ఇటీవల బంగ్లాదేశ్ మహిళా జట్టులో సీనియర్ ప్లేయర్ జహనారా ఆలం చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె ఆరోపణల ప్రకారం, 2022 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సమయంలో టీమ్ కోచ్ మంజూరుల్ ఇస్లాం తనను పదే పదే వేధించాడని, అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది.
* కోచ్ అసభ్య ప్రవర్తన వివరాలు
జహనారా చెబుతున్న వివరాల ప్రకారం.. ఇస్లాం తరచూ ఆమె భుజాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించేవాడట. అంతేకాదు, పీరియడ్స్ డేట్ గురించి కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడిగి ఆమెను మానసికంగా వేధించేవాడని చెప్పింది. దీనిపై ఆమె ప్రశ్నిస్తే “నేను రెడీ కావాలి కదా” అని అసహ్యమైన సమాధానం ఇచ్చాడట.
ఆమె ఈ అన్యాయాలను ఎదుర్కొన్నా, వాటిని బయటపెట్టడానికి ఆ సమయంలో ధైర్యం చేయలేకపోయిందని తెలిపింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా తన బాధను ప్రపంచానికి వెల్లడించింది. జహనారా చెప్పిన విషయాలకు అనేక బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. వారు కూడా ఇస్లాం చేత అన్యాయం జరిగిందని అక్కడి మీడియా నివేదికలు చెబుతున్నాయి.
*బోర్డుపై ఒత్తిడి, దర్యాప్తుకు డిమాండ్
ఈ ఘటన వెలుగులోకి రావడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జహనారా ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, మహిళా ప్లేయర్ల భద్రతకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అభిమానులు, మాజీ ప్లేయర్లు డిమాండ్ చేస్తున్నారు.
మహిళా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘటన ఒక్క బంగ్లాదేశ్‌కే పరిమితం కాకుండా, సమగ్రంగా వ్యవస్థలో మార్పు అవసరాన్ని గుర్తుచేస్తోంది. ప్రతిభ ఆధారంగా అవకాశాలు రావాలి.. కాదు అంటే మహిళా ఆటగాళ్లు ఎదుర్కొంటున్న ఈ రకమైన వేధింపులు క్రీడాస్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తాయి.
* రక్షణే ప్రథమం
క్రీడలు గౌరవం, క్రమశిక్షణ, సమానత్వానికి ప్రతీక కావాలి. మహిళా క్రీడాకారిణులు భయంలేకుండా తమ ప్రతిభను ప్రదర్శించే వాతావరణం కల్పించడం ప్రతి క్రీడా సంస్థ బాధ్యత. జహనారా ఆలం ధైర్యంగా బయటపెట్టిన ఈ నిజం, భవిష్యత్‌లో అలాంటి కోచ్‌లను బయటకు తీసే మార్గం కావాలి.
