Begin typing your search above and press return to search.

జ‌గ్గ‌య్య‌పేట జ‌గ‌డం.. లోక‌ల్ వార్‌కు రెడీ..?

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో పట్టణంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని, జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము టీడీపీలో చేరినట్లు వలస వెళ్లిన ప్రజాప్రతినిధులు అప్ప‌ట్లో చెప్పారు.

By:  Garuda Media   |   15 Sept 2026 11:00 PM IST
జ‌గ్గ‌య్య‌పేట జ‌గ‌డం.. లోక‌ల్ వార్‌కు రెడీ..?
X

ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మునిసిపాలిటీ రాజకీయం వేడివేడిగా ఉంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ హ‌వా కొన‌సాగుతున్నా.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌పార్టీ నాయ‌కులు సామినేని ఉద‌య‌భాను స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సామినేని ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అనంతరం.. ఆయ‌న జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, 2024 ఎన్నికలలో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మున్సిపాలిటీలో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాల మార్పులతో మున్సిపాలిటీ టీడీపీ వశమైంది.

జగ్గయ్యపేట మునిసిపాలిటీ ప్రస్తుత రాజకీయ పరిణామాలను గ‌మ‌నిస్తే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావుతో పాటు పలువురు వైసీపీ కౌన్సిలర్లు మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మొత్తం 31 వార్డులు/కౌన్సిలర్లు ఉన్న జగ్గయ్యపేట మున్సిపాలిటీలో చైర్మన్, మరికొంతమంది కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరడంతో వైసీపీ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో పట్టణంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని, జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే తాము టీడీపీలో చేరినట్లు వలస వెళ్లిన ప్రజాప్రతినిధులు అప్ప‌ట్లో చెప్పారు. ఇదిలావుంటే.. జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భానుకు గత రెండు దశాబ్దాలుగా టీడీపీతో రాజకీయ వైరం ఉంది. అయితే.. ఇప్పుడు ఆయ‌న జ‌న‌సేన‌లో ఉండ‌డం.. ఈ పార్టీ టీడీపీతో క‌లిసి ఉన్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేతో క‌లివిడి త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కూటమి అంతర్గత సమీకరణాలు ఎలా ఉన్నా సామినేని మాత్రం త‌న హ‌వాను నిలుపుకొనేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. స్థానిక స‌మ‌రంలో త‌న వారికి ఎక్కువ సీట్లు వ‌చ్చేలా చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఉదయభాను సెప్టెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆయనకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్య తలు అప్పగించారు. ఈ నేప‌థ్యం కూడా ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు తోడైంది. దీంతో త‌న హ‌వాను నిలుపుకొనేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర త‌న బ‌లాన్ని చాటుకునేందుకు సామినేని వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇది వివాదాల‌కు దారితీస్తుందా.. లేక స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతారా? అనేది చూడాలి.