అవకాశం ఇస్తే.. హరీష్‌రావుపై పోటీ చేస్తా: జగ్గారెడ్డి
వచ్చే ఎన్నికల్లో తనకు పార్టీ అవకాశం ఇస్తే.. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుపై పోటీ చేస్తానని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 11 July 2026 8:50 PM ISTవచ్చే ఎన్నికల్లో తనకు పార్టీ అవకాశం ఇస్తే.. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుపై పోటీ చేస్తానని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ విషయం లో పార్టీనిర్ణయానికే కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ ఎలా ఆదేశిస్తే.. ఆ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. జగ్గారెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తనకు ఎమ్మెల్సీ అయినా ఇవ్వలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. తన స్థానంలో తన భార్య పోటీ చేస్తుందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిగా ఎదిగిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనూ ముఖ్య నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఆయన పోటీ విషయంపై స్పందిస్తూ.. తనకు అవకాశం ఇస్తే.. హరీష్‌రావు(సిద్దిపేట)పై పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడించే ప్రయత్నం చేస్తానన్నారు. నాయకుడిగా ఓకే అయినా.. మనిషిగా హరీష్‌రావు విఫల మయ్యారని అన్నారు. హరీష్‌రావు.. ఏదో తెలియని బాధలో ఉన్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు ఛీకొడుతున్నా బీఆర్ ఎస్ నాయకులు మారడం లేదని అన్నారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అయితే.. పనిచేయని ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని చెప్పారు.గతంలో పనిచేయని ఎమ్మెల్యేలను పక్కన పెట్టకపోవడం వల్లే కేసీఆర్ దెబ్బతిన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం కు సూచిస్తున్నట్టు చెప్పారు. అయితే.. తాను ఏం చెప్పినా ఓ వర్గం తనపై బురదజల్లుతూనే ఉందని వ్యాఖ్యానించారు. అయినా.. తాను మానేది లేదని, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానని అన్నారు.
