Begin typing your search above and press return to search.

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కనిపించుట లేదు

జూలై 21న జగదీప్ ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. రాజీనామాకు ఆరోగ్య కారణాలను చూపినప్పటికీ, అంతర్గత రాజకీయ విభేదాలే అసలు కారణమని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By:  A.N.Kumar   |   16 Aug 2025 5:00 AM IST
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కనిపించుట లేదు
X

గత నెల ఉపరాష్ట్రపతి పదవికి హఠాత్తుగా రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖర్ ఆ తర్వాత కనిపించకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అదృశ్యం చుట్టూ అనేక ఊహాగానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన ఎక్కడ ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- రాజీనామా.. ఆ తర్వాత మౌనం

జూలై 21న జగదీప్ ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. రాజీనామాకు ఆరోగ్య కారణాలను చూపినప్పటికీ, అంతర్గత రాజకీయ విభేదాలే అసలు కారణమని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

-ప్రతిపక్షాల ఆందోళన

శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన చిరునామా, ఆరోగ్య పరిస్థితి తెలియకపోవడం విచారకరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ధన్‌ఖర్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కూడా ఆయన వెల్లడించారు. అలాగే, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ "లాపతా లేడీస్ సినిమా గురించి విన్నాను, కానీ లాపతా వైస్ ప్రెసిడెంట్ గురించి మాత్రం ఎప్పుడూ వినలేదు" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

-అధికారిక నివాసంలోనే?

నివేదికల ప్రకారం రాజీనామా తర్వాత కూడా ధన్‌ఖర్ ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లోనే నివసిస్తున్నారని సమాచారం. మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ సెక్రటేరియట్ ఆయనకు ఒక ప్రైవేట్ సెక్రటరీని కూడా నియమించింది. సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉపరాష్ట్రపతులకు లూటియన్స్ జోన్‌లో ‘టైప్-8’ ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. ధన్‌ఖర్ కూడా కొత్త బంగ్లాకు మారే ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం పాత నివాసంలోనే ఉన్నారు.

ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. జగదీప్ ధన్‌ఖర్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు, ఆరోగ్య పరిస్థితి, రాజీనామా వెనుక గల అసలు కారణాలు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉన్నాయి. ఆయన ఎప్పుడు ప్రజల ముందుకు వస్తారు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనేది ఇప్పుడు దేశ ప్రజలందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్నలు.