Begin typing your search above and press return to search.

బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్ వైపు జగన్ చూపు... ?

దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది

By:  Garuda Media   |   26 Aug 2026 8:00 AM IST
బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్ వైపు జగన్ చూపు... ?
X

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఆయన తన అడుగులు మారుస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

గత ఐదేళ్ల అధికార కాలంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పలు కీలక బిల్లులు, విధానపరమైన నిర్ణయాల్లో జగన్ బేషరతు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ వైఖరిలో మార్పు రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలపడుతుండటం, కేంద్రంలోని విధానాలపై యువతలో వ్యతిరేకత పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ రాజకీయ పునరాలోచనలో భాగంగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో జగన్ బెంగళూరు వేదికగా రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌తో తీవ్ర విభేదించి సొంత పార్టీని స్థాపించిన జగన్, ఇప్పుడు మనుగడ కోసం అదే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

ఇక ఈ రాజకీయ పరిణామాల వెనుక కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు కూడా ఒక కారణం కావచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ సహా పలు ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచడం, కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు ఈ పొలిటికల్ రీ-అలైన్‌మెంట్‌కు దారితీశాయని భావిస్తున్నారు. కేంద్రం నుంచి ఎదురవుతున్న రాజకీయ, న్యాయపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు పరోక్ష మైత్రిని వీడి, విమర్శల దాడిని పెంచడమే సరైన మార్గమని వైసీపీ శిబిరం భావిస్తున్నట్లు సమాచారం. మ‌రి ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు శ్రీకారం చుడతాయో వేచి చూడాలి.