జగన్ కేసులు మళ్లీ వెనక్కి.. రీజనేంటి..?
వైసీపీ అధినేత జగన్‌పై అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీటి విచారణ కొలిక్కి వస్తుంద ని భావిస్తున్న ప్రతిసారీ.. ఏదో ఒక రూపంలో వెనక్కి వెళ్తున్నాయి.
By: Garuda Media | 20 Dec 2025 5:51 PM ISTవైసీపీ అధినేత జగన్‌పై అక్రమాస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వీటి విచారణ కొలిక్కి వస్తుంద ని భావిస్తున్న ప్రతిసారీ.. ఏదో ఒక రూపంలో వెనక్కి వెళ్తున్నాయి. న్యాయమూర్తులు మారడం.. లేదా కోర్టు లను మార్చడంతో ఈ కేసుల పురోగతి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం ముందుకు సాగడం లేదు. తాజాగా కూడా మరోసారి ఈ కేసులు వెనక్కి వెళ్లాయి. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రఘురాం బదిలీ అయ్యారు.
వాస్తవానికి న్యాయమూర్తుల బదిలీ వ్యవహారం కొత్త కాకపోయినా.. జగన్ కేసులు విచారణకు వస్తున్నాయి.. అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి బదిలీలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా.. అప్పటి వరకు కేసులు విచారించి.. ఇక, తీర్పు ఇచ్చే సమయానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో రఘురాం బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అన్నీ మొదటి నుంచి వింటామని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే కేసులు విచారణకు వచ్చాయి.
వీటిని వినేందుకు.. అనంతరం తీర్పు చెప్పేందుకు ఎంత సమయం పడుతుందన్నది కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. తాజాగా పట్టాభిరామారావు అనే న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత.. ఆయన ఈ కేసులు విచారించి.. తీర్పు చెప్పే సమయానికిఏం జరుగుతుందన్నది తెలియదు. దీంతో జగన్ కేసులు నానాటికీ.. విచారణకు దూరమవుతున్నాయన్న చర్చ తెరమీదికి వస్తోంది. గతంలోనే ఈ విషయాన్ని సీబీఐ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు విన్నవించింది.
పదే పదే జాప్యం జరుగుతోందని.. కేసుల విచారణను ముమ్మరం చేయాలని కూడా తేల్చి చెప్పింది. అయినా.. కూడా ఎక్కడో తేడా కొడుతుండడం గమనార్హం. కాగా.. సీబీఐ ఇప్పటికే వేసిన పలు చార్చి షీట్లలో 43 వేల కోట్ల మేరకు జగన్ అక్రమంగా సంపాయించారని తెలిపింది. అయితే.. కొందరు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం.. మరికొన్నికేసుల్లో సాక్షులను ఇంకా విచారించాల్సి ఉండడంతో కేసుల విచారణ ముందుకు సాగడం లేదన్నది వాస్తవం.
