మాజీ ఎంపీకి సీటు మార్చేసిన జగన్..!
నాయకులకు సీట్లు మార్చి.. వారి తలరాతలు మార్చేస్తున్న వైసీపీ అధినేత జగన్.. తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రయోగం వికటించింది.
By: Garuda Media | 19 Jan 2026 11:00 PM ISTనాయకులకు సీట్లు మార్చి.. వారి తలరాతలు మార్చేస్తున్న వైసీపీ అధినేత జగన్.. తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రయోగం వికటించింది. అనేక మంది నాయకులను సిట్టింగు లను మార్చేసి.. ప్రయోగం చేశారు. కానీ, ప్రజలు ఛీత్కరించారు. అయినప్పటికీ.. ఈ ప్రయోగానికే జగన్ మొగ్గు చూపుతున్నారు. తాజాగా పలు నియోజకవర్గాలకు నాయకులను మార్చుతున్నారు. వారికి ఇష్టం ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడుతున్నారు.
జగన్.. తన ఇష్టాన్ని జనాలపైనే కాదు.. నాయకులపైనా రుద్దుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా పంపించాలని నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత రెండు ఎన్నికల్లో నందిగం బాపట్ల నుంచే పోటీ చేశారు. 2019లో విజయం దక్కించుకున్న ఎస్సీ నాయకుడు .. గత ఎన్నికల్లో మాత్రం పరాజ యం పాలయ్యారు. ఆ తర్వాత.. పోలీసు కేసుల్లో చిక్కుకున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన బెయిల్‌పైనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మౌనంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి చూసుకుందాం? అనే భావనలో కూడా ఉన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తన సతీమణిని కూడా బరిలో నిలుపుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకో.. లేక పార్టీ వ్యూహాత్మక నిర్ణయమో తెలియదు కానీ.. తాజాగా నందిగం సురేష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయం పై నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో వైసీపీకి ప్రాతినిధ్యం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత.. తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడుకు వెళ్లిపోయారు. దీంతో తాడికొండ నుంచి నందిగంను బరిలో నిలపాలన్నది వైసీపీ వ్యూహం. రాజధాని ప్రాంతంపై నందిగంకు అవగాహన ఉండడం.. ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలు కూడా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయనను ఇక్కడకు పంపించాలని చూస్తున్నారని తెలిసింది.
