వైసీపీలో ప్రయోగాలు.. విషయం ఇదీ.. !
ప్రతిపక్షం వైసీపీలో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లో మార్పుల నుంచి జిల్లాల ఇంచార్జిల వరకు ఈ మార్పులు కొనసాగుతున్నాయి.
By: Garuda Media | 12 Aug 2025 6:00 PM ISTప్రతిపక్షం వైసీపీలో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. నియోజకవర్గాల్లో మార్పుల నుంచి జిల్లాల ఇంచార్జిల వరకు ఈ మార్పులు కొనసాగుతున్నాయి. ఏడాది కిందట ఎన్నికల అనంతరం మార్పులు చేసిన పార్టీ అధినేత జగన్.. ఇప్పుడు మరోసారి మార్పుల దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. వీటి కారణంగానే మరోసారి పార్టీలో మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు. గత 10 మాసాల కిందట జరిగిన మార్పుల్లోనూ ఇప్పుడు కొన్ని తీసివేతలు ఉంటాయని చెబుతున్నారు.
ప్రధానంగా ఇవీకారణాలు:
1) నియోజకవర్గాల్లో నేతలపై పట్టు లేకపోవడం: ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లుగా ఉన్న నాయకులకు పట్టు లేదన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు విజయవాడ పశ్చిమలో గత ఎన్నికల సమయంలో ఆసిఫ్‌కు అవకాశం ఇచ్చారు. కానీ, ఆయన పుంజుకోలేక పోతున్నారు. బలం ఎక్కడా కనిపించడం లేదు. ఇక, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోనూ.. పరిస్థితి ఇలానే ఉంది. నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి ఇక్కడ పుంజుకోలేక పోతున్నారు. ఇలా.. ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేయనున్నారు.
2) పాతవారికే ఛాన్స్: ప్రస్తుతం నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఇంచార్జ్‌లు లేరు. గత ఎన్నికల్లో చేసిన మా ర్పుల కారణంగా.. నియోజకవర్గాలపై ప్రభావం పడింది. నేతలను ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్పు చేసిన ఫలితంగా.. రెండు చోట్లా పార్టీ పట్టు పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు పాతవారికే తిరిగి వారి వారి నియోజకవర్గాలను అప్పగించనున్నారు. తద్వారా తిరిగి బలమైన నియోజ కవర్గాలు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సుమారు 50 నియోజకవర్గాల్లో పాతవారికే ఛాన్స్ చిక్కనుంది. ఇదే సమయంలో అభ్యర్థులు లేని నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నారు.
3) జిల్లాల ఇంచార్జ్‌లు: ప్రస్తుతం జిల్లాలకు ఉన్న ఇంచార్జ్‌ల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. కొందరు బాగానే పనిచేస్తున్నా.. మరికొందరు వెనుకబడుతున్నారు. వీరిపై ఇప్పటికే రిపోర్టులు తెప్పించుకున్న పార్టీ అధినేత మార్పులు, చేర్పల దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. తద్వారా యాక్టివ్‌గా ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలానే.. జిల్లాల నేతలపై కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా జిల్లాల్లో జరుగుతున్న రాజకీయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతోపాటు వాటిని కంట్రోల్ కూడా చేయనున్నారు.
