అసెంబ్లీకి వైసీపీ... తేల్చేసిన జగన్ !
మరో వైపు చూస్తే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టులో తమ పార్టీ వేసిన కేసు విచారణ దశలో ఉందని జగన్ అన్నారు.
By: Satya P | 10 Sept 2025 4:00 PM ISTఏపీ అసెంబ్లీకి వైసీపీ వస్తుందా రాదా అన్న చర్చ అయితే ఇంకా సాగుతోంది. ఆ మాటకు వస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతీ సారీ ఈ చర్చ వస్తూనే ఉంది దాంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం ఎపుడు పెట్టినా ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. అయితే దానికి జగన్ తాజా ప్రెస్ మీట్ లోనే తేల్చేసారు. తమ విధానం వెరీ క్లియర్ అని ఆయన చెప్పుకొచ్చారు. పదే పదే తమను ఈ ప్రశ్న ఎన్ని సార్లు అడిగినా తమ సమాధానం ఒక్కటే ఉంటుందని కూడా గట్టిగానే చెప్పారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే :
ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉంది అని ఆయన గుర్తు చేశారు అటు అధికార కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని ఎక్కువ పార్టీలు ప్రతిపక్షంలో ఉంటే అపుడు ఎవరికి ఎంత నంబర్ ఎంత మంది ఎమ్మెల్యేలు అనుకోవచ్చు కానీ ఏకైక ప్రతిపక్షం ఉంటే కచ్చితంగా వారినే ఎక్కడా ఇనా విపక్షంగా గుర్తిస్తారు అని అన్నారు. కానీ ఏపీ స్పీకర్ మాత్రం వైసీపీని విపక్షం గా గుర్తించడం లేదని ఆయన అన్నారు తమను విపక్షంలో గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందని అందుకే ఇలా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో తమను కూడా ఒకరిగా చూపిస్తూ ఏ అయిదు నిముషాలో మైక్ ఇస్తే తాము ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించగలుగుతామని ఆయన ప్రశ్నించారు.
వినేందుకు సిద్ధంగా లేరు :
ప్రజా సమస్యల గురించి చెప్పాలనుకుంటే వినేందుకు అధికార పక్షం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం తప్పులు సైతం చెప్పినా భరించేందుకు కూడా రెడీగా లేదని అన్నారు తాను ప్రెస్ మీట్ రెండు గంటల పాటు పెట్టి చెబితేనే తప్ప అనేక విషయాల మీద కనీస అవగాహన ఎవరికీ కల్పించలేమని అలాంటిది అయిదు నిమిషాలు మైక్ ఇస్తామంటే ఎలా అని ఆయన అన్నారు. ప్రతిపక్షమే లేదని అసలు వద్దు అని అంటోంది కూటమి ప్రభుత్వం అని ఆయన ఫైర్ అయ్యారు. వారికి విపక్షంతో కానీ ప్రజా సమస్యలతో కానీ పని లేదని అన్నారు.
కోర్టులో కేసు ఉంది :
మరో వైపు చూస్తే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టులో తమ పార్టీ వేసిన కేసు విచారణ దశలో ఉందని జగన్ అన్నారు. కోర్టు స్పీకర్ ఆఫీసుని దీని మీద వివరణ అడిగిందని తాము ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదో కోర్టుకే చెబితే సరిపోతుంది కదా అని జగన్ అన్నారు. అపుడు కోర్టు జడ్జిమెంట్ కూడా బయటకు వస్తుంది కదా అని ఆయన అన్నారు అలా చేయకుండా కోర్టుకు ఏమీ చెప్పకుండా తమకు హోదా విషయంలో ఏమీ తేల్చకుండా చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు మీద అనర్హత వేటు వేయాలి :
తాను అసెంబ్లీకి గైర్ హాజరు అవుతున్నానని తమ ఎమ్మెల్యే సభ్యత్వం మీద అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారని సభకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి కాదు కదా అని ఆయన అన్నారు తాను సీఎం గా ఉన్నపుడు చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారో గుర్తు చేసుకోవాలని జగన్ అన్నారు ఆనాడు సభలో ఏమీ జరగకపోయినా తనను అవమానించారు అని అంటూ ఏడ్చి డ్రామా చేసి మరీ బాబు సభను బాయ్ కాట్ చేశారు అన్నారు. జగన్ సీఎం గా ఉన్నంతవరకూ సభకు రాను అని ఆయన వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు కదా అని జగన్ అన్నారు. మరి చంద్రబాబు మీద ఏ అనర్హత విధిస్తారో చెప్పాలని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని అంతా తాము అనుకున్నట్లే జరగాలంటే జరగదని జగన్ అన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని వారే మరో మూడేళ్ళలో జరిగే ఎన్నికల్లో తీర్పు చెబుతారు అని జగన్ చెప్పారు
వైసీపీ రానట్లేనా :
మొత్తం మీద చూస్తే తమ స్టాండ్ ఏమీ మారలేదని జగన్ తేల్చేశారు. తాము అసెంబ్లీకి హాజరయ్యేది ఉండదని కూడా స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని ఆయన బంతిని స్పీకర్ కోర్టులో అలాగే అధికార పక్షం కోర్టులోనే ఉంచారు. దాంతో ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు యధా ప్రకారం కూటమి పార్టీలతోనే సాగుతాయని అంటున్నారు. ఇక జగన్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అధికార కూటమి ఏ విధంగా రియాక్టు అవుతుందో చూడాల్సి ఉంది.
