అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అజెండా ఇదే.. ఫిక్స్ అయిన జగన్
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై విపక్షం వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి.
By: Tupaki Political Desk | 12 Aug 2026 5:19 PM ISTఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై విపక్షం వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తుండగా, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అదేసమయంలో శాసనసభతోపాటు మండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వెళ్లాలని నిర్ణయించారు. అదేసమయంలో శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేలా పలు అస్త్రాలను సిద్ధం చేయాలని చర్చించారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది. శాసనమండలి సమావేశాల్లో ఇదే ప్రధాన అజెండాగా చర్చకు పట్టుబడాలని ఆ పార్టీ నిర్ణయించిందని చెబుతున్నారు. అంతేకాకుండా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం జగన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. శాసనమండలికి యథావిధిగా హాజరుకావడంతోపాటు అసెంబ్లీ బయట రకరకాల కార్యక్రమాలతో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇక అసెంబ్లీ ప్రారంభానికి ఐదు రోజులు ముందుగానే విపక్షం అజెండా ఫిక్స్ చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే డీఎస్సీ స్పోర్ట్సు కోటాలో అక్రమాలపై వైసీపీ అనేక రకాలుగా ఆందోళనలు చేస్తోంది. రిలే నిరాహారదీక్షలతోపాటు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావిస్తున్న ప్రతిపక్ష సభ్యులు ఈ విషయంపై శాసనమండలిలో తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పడంతో వర్షాకాల సమావేశాలకు ముందే రాజకీయం కాకపుట్టిస్తోందని చెబుతున్నారు.
విపక్షం అజెండా ఎలా ఉండబోతుందో తేలిపోవడంతో ఇక ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీకి రామని చెబుతున్న వైసీపీ తమ ఆరోపణలు మాత్రం ఆపమని తేల్చిచెబుతోంది. దీంతో విపక్షానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం ఏ మార్గం ఎంచుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. శాసనమండలిలో ఇప్పటికీ విపక్షానికే బలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ వాదనను సమర్థంగా తీసుకువెళ్లే అవకాశాలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో బలం ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు హాజరుకాకపోవడం వల్ల చర్చలు ఏకపక్షంగా సాగిపోనున్నాయని అంటున్నారు. దీంతో ప్రభుత్వ వాదన ప్రజల్లోకి వెళుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ అసెంబ్లీ అజెండాపై వైసీపీ ముందుగానే స్పష్టత ఇవ్వడంతో ఈ సారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
