Begin typing your search above and press return to search.

బ్యాలెట్ ఎలక్షన్స్ కు ఇండి కూటమి డిమాండ్.. జగన్ నిర్ణయమే కీలకం

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని ప్రతిపక్షం ఇండి కూటమి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? అనే చర్చకు తెరలేపింది.

By:  Tupaki Political Desk   |   2 Oct 2026 12:00 AM IST
బ్యాలెట్ ఎలక్షన్స్ కు ఇండి కూటమి డిమాండ్.. జగన్ నిర్ణయమే కీలకం
X

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని ప్రతిపక్షం ఇండి కూటమి తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? అనే చర్చకు తెరలేపింది. ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఓట్లను చోరీ చేస్తున్నారని విపక్ష కూటమి పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆరు దశల్లో విస్తరించాలని నిర్ణయించింది. అయితే జాతీయస్థాయిలో వివిధ ప్రాంతీయ పార్టీలు మద్దతు ప్రకటించిన ఈ ఉద్యమంపై వైసీపీ స్పందించకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.

దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ఇండికూటమి ఆరోపిస్తుంటే, రాష్ట్రంలో ఈవీఎంల ట్యాంపిరింగ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో గత రెండేళ్లుగా వైసీపీ, ఆ పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా విపక్షం కూడా దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడంతో వైసీపీ కూడా వారితో చేతులు కలుపుతుందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కేంద్రంలో తటస్థ వైఖరి అనుసరిసరిస్తున్నప్పటికి, అవసరమైన సందర్బాల్లో బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వ్యతిరేక వైఖరి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని, తమ విజయాన్ని లాక్కుందని ఇన్నాళ్లు ఆరోపణలు చేసిన వైసీపీకి ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉద్యమించి, ప్రజలల్లో ఆలోచనలు రేకెత్తించే అవకాశం విపక్షాల ద్వారా లభించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్ష కూటమితో చేతులు కలిపి తమ రాష్ట్రంలోనూ ఓటు చోరీ జరిగిందని వైసీపీ చెబుతుందా? లేకపోతే గతంలో తాము చేసిన విమర్శలను తొక్కిపెట్టి బీజేపీ అనుకూల విధానం పాటిస్తుందా? అనేదానిపై ఆసక్తి రేగుతోందని అంటున్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలంటే విపక్షంతో చేతులు కలపక తప్పదని, అలా జరిగితే కేంద్రం తీసుకోబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది వైసీపీ ముందుగా తేల్చుకోవాలని అంటున్నారు.

మొత్తానికి ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీసుకోబోయే నిర్ణయమే ఆయన భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించనుందని అంటున్నారు. ఈవీఎంలపై ఆరోపణలకు కట్టుబడితే విపక్షంతో కలిపి ఉద్యమంలో పాల్గొంటారా? కనీసం తన పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తారా? అనేదానిపైన చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల ఎన్నికల కమిషన్ లో భేదాభిప్రాయాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సమయంలో జగన్ చేసిన ట్వీట్ ను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ తన పారదర్శకతను నిరూపించుకోవాలని జగన్ సూచించడం ద్వారా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చాకచక్యంగా వ్యవహరించారని అంటున్నారు. ఇప్పుడు కూడా విపక్షం ఇండి కూటమి పిలుపునిచ్చిన ఆందోళనలను తనకు అనుకూలంగా మల్చుకోవాలా? లేక ఆ ఉద్యమానికి తమ పార్టీ రాజకీయానికి సంబంధం లేనట్లు మౌనం వహించాలా? అనేది జగన్ తేల్చుకోవాల్సివుంటుందని అంటున్నారు.