అయినా జగన్ మారలేదూ...వైసీపీలో అదే చర్చ !
ఎల్ నినో ప్రభావంతో ధరాఘాతంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బియ్యం పావు మూట మీద ఏకంగా నాలుగు నుంచి అయిదు వందల దాకా ధరలు పెరిగిపోయాయి.
By: Satya P | 16 Sept 2026 8:15 AM ISTవైసీపీ అధినేత జగన్ గురించి సొంత పార్టీ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. జగన్ రాజకీయ పార్టీని స్థాపించి ఒకసారి అధికారంలోకి వచ్చారు. రెండు సార్లు ఓడారు, రెండవసారి అయితే ఘోరమైన పరాజయం పలకరించింది. అయితే గెలిచినపుడు ఓడినపుడు జగన్ ఒకేలా ఉన్నారు అన్నది వైసీపీ నేతల మాట. ఆయన తీరు అయితే మారలేదని అంటున్నారు. నిజానికి 2014లో వైసీపీ గెలిచి ఓడింది. 2024 పరిస్థితి అలా కాదు, దారుణమైన పరాజయం పలకరించింది. నిజానికి ఇది వైసీపీ పుట్టాక అతి పెద్ద ఎదురుదెబ్బగా అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఓటమి చెంది ఇప్పటికి రెండేళ్ళకు పైగా సమయం గడుస్తున్నా ఈ అంశం మీద సమగ్రమైన సమీక్ష ఎక్కడా జరగలేదని అంటున్నారు. ఓటమి నుంచి గెలుపునకు బాటలు వేసుకోవాల్సి ఉండగా వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో తనదైన శైలిలో ఆలోచిస్తోంది అని అంటున్నారు.
జనాలు పోటెత్తుతున్నారు :
వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. జగన్ అడుగు తీసి బయటపెట్టారు అంటే జనాలు తండోప తండాలుగా వస్తున్నారు. దాంతో ఈసారి విజయం మనదే అన్న భావన అయితే వైసీపీ పెద్దలలో బలంగా ఏర్పడుతోంది అని అంటున్నారు. అయితే జనాలు రావడం ఒక్కటే విజయానికి కొలమానం కాదని అంటున్నారు. అదే కనుక అయితే జగన్ కి ఎపుడు జనాలు రాని పరిస్థితి ఉందని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. 2024 ఎన్నికల్లో జగన్ సభలకు జనాలు బాగానే వచ్చారు. కానీ ఫలితాలు చూస్తే 11 సీట్లకే పరిమితం అయి చతికిలపడింది. అందువల్ల జనాలు వచ్చినా వారిని ఓట్లుగా మార్చుకోవాలంటే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలని పార్టీని గట్టి పరచుకోవాలని అంటున్నారు.
ప్రజా సమస్యలతోనె :
ఇక వైసీపీ అయితే ఈ రెండేళ్లలో కొన్ని పోరాటాలు చేసింది. ప్రజా సమస్యల మీద ఉద్యమించింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం మెగా డీఎస్సీ అని ఒకే అంశం మీద ముందుకు సాగుతోంది. ఇందులో కూడా యువతను కలుపుకుని పోవడం లేదని అంటున్నారు. దాంతో ఇది వైసీపీ ఆరాటంగా మాత్రమే మారింది. వైసీపీ రాజకీయ ఉద్దేశ్యాలతోనే ఈ విధంగా విమర్శలు చేస్తోంది అని కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. బాధితులు ఎవరూ వైసీపీ వెంట లేరని కూడా అంటున్నారు. ఈ విధంగా చూస్తే మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ మరింతగా ముందుకు పోయే ఆలోచనతోనే ఉండడం పట్ల కూడా పార్టీలో చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి కదా అని గుర్తు చేస్తున్నారు.
ధరాఘాతంతో జనం :
ఎల్ నినో ప్రభావంతో ధరాఘాతంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బియ్యం పావు మూట మీద ఏకంగా నాలుగు నుంచి అయిదు వందల దాకా ధరలు పెరిగిపోయాయి. అలాగే ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. అనేక ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ లాంటి మహా నగరంలో అయితే తాగు నీరు లేక జనాలు అల్లాడుతున్నారు. అదే విధంగా చూస్తే రైతులు సాగు నీరు లేక కష్టాలు పడుతున్నారు. వీటి మీద వైసీపీ ఉద్యమిస్తే బాగుంటుందని పార్టీ నేతల నుంచి సూచనలు వస్తున్నా మెగా డీఎస్సీతోనే అధినాయకత్వం ముందుకు పోతోంది అని అంటున్నారు.
పార్టీ నేతలతోనూ :
ఇక పార్టీ క్యాడర్ తో నాయకులతో టచ్ లో ఉండాల్సిన అధినాయకత్వం ఆ విధంగా చేయడం లేదని అంటున్నారు. అలాగే పార్టీలో ఉండే వారు ఉంటున్నారు. కొందరు ఫుల్ సైలెంట్ అయ్యారు, మరి కొందరు అసంతృప్తితో ఉన్నారు, ఇంకొందరు పార్టీని సడెన్ గా వీడుతున్నారు. మరి ఈ నేపధ్యంలో గ్రౌండ్ లెవెల్ లో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని వైసీపీ ఇప్పటి నుంచే కాపాడుకుంటేనే 2029 ఎన్నికల్లో వారు బాసటగా నిలుస్తారు అని అంటున్నారు. కానీ వైసీపీ పెద్దలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు. మొత్తానికి కూటమి మీద వ్యతిరేకత పూర్తిగా ఉందని అందువల్ల వైసీపీ గెలిచి తీరుతుందని పెద్దలు ధీమా పడుతున్నారని అంటున్నారు. అయితే కూటమిగా మూడు పార్టీలు ఆ వైపున ఉన్నాయని వైసీపీ ఒంటరి పోరాటం చేస్తోందని గుర్తు పెట్టుకుని తీరు మార్చుకోవాలని వైసీపీ హితైషులు సూచిస్తున్నారు.
