జగన్ షర్మిల ఒక్కటవుతారా ...కడప నేత జోస్యం
ఏపీలో అన్నా చెల్లెళ్ళు అయిన వైఎస్ జగన్ షర్మిల ఇద్దరూ వేరు వేరు రాజకీయ పంధాను ఎంచుకున్నారు.
By: Satya P | 20 Dec 2025 9:18 AM ISTఏపీలో అన్నా చెల్లెళ్ళు అయిన వైఎస్ జగన్ షర్మిల ఇద్దరూ వేరు వేరు రాజకీయ పంధాను ఎంచుకున్నారు. ఇది పెద్ద విశేషం అయితే కాదు, చాలా రాజకీయ కుటుంబాలలో అన్న దమ్ములు అన్నా చెల్లెళ్ళు వేరు పార్టీలలో ఉండడం అన్నది చాలా కాలంగా జరుగుతున్న విషయమే. అయితే అందరి తీరు వేరు, జగన్ షర్మిల తీరే చిత్రంగా ఉందని అన్నది విశ్లేషణ. ఎందుకు అంటే ఇది రాజకీయం దాటి వ్యక్తిగతంగా మారింది. చాలా దూరం వెళ్ళింది. ఆ మాటకు వస్తే వ్యక్తిగతమే రాజకీయంగా మారింది అని కూడా అంటారు. ఏది ఏమైనా గత రెండు మూడేళ్ళుగా వైఎస్సార్ బిడ్డలు ఇద్దరూ రాజకీయంగా వేరు మార్గాలు పట్టి విభేదించుకోవడం అయితే అసలైన వైఎస్సార్ అభిమానులకు నచ్చడం లేదు, తప్పు ఎవరిది ఎక్కడ ఉంది అన్నది వేరే సంగతి. కానీ మళ్ళీ ఆ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని అంతా కలసిపోవాలని కోరుకున్న వారే అత్యధికంగా ఉన్నారు.
కలిసిపోతారా :
అయితే నీటి కంటే రక్తం చిక్కన అన్న సామెత ఉండనే ఉంది. గతంలో కూడా చాలా మంది రాజకీయంగా విభేదించుకున్నా తరువాత కాలంలో కలిసిపోయారు. అలా ఆలోచిస్తే జగన్ షర్మిల కూడా ఏదో నాటికి కలిసే వీలు ఉందని భావించవచ్చు. అయితే అది ఇప్పట్లో సాధ్యమవుతుందా అంటే కూడా ఎవరూ చెప్పలేరు అని అంటున్నారు. అయితే జగన్ షర్మిల ఇద్దరూ పట్టుదల కలిగిన వారే కావడంతో ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లోకి రావడమన్నది కాలమే తేల్చాల్సిన విషయం అని కూడా అంటుంటారు.
కడప నేత జోస్యం :
అయితే దీని మీద ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కడపకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ అయిన సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ షర్మిల కలిసి పోయేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగన్ కి చెల్లెలు అంటే అభిమానం అని అలాగే కుటుంబం ఎపుడూ గ్రేట్ అన్నట్లుగా మాట్లాడారు. జగన్ ని తాను దగ్గరగా చూస్తున్నానని ఆయన తప్పులు ఎపుడూ చేయరని అన్నారు. అదే సమయంలో ఆయన ఎవరికైనా మేలు చేసే మనిషిగానే తాను దగ్గర ఉండి చూసిన అనుభవంతో చెబుతున్నాను అన్నారు.
సైలెంట్ అయిన వైనం :
ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె గత కొంతకాలంగా కూటమి మీదనే విమర్శలు చేస్తున్నారు. జగన్ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఎక్కడా కామెంట్స్ అయితే చేయడం లేదు అని గుర్తు చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ నేతగా ఆమె చేయాల్సింది కూడా అదే అని అంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తారు. కానీ గతంలో మాత్రం కూటమి కంటే ఎక్కువగా వైసీపీని విమర్శించిన షర్మిల ఇపుడు వైఖరిలో మార్పు ఉందా అన్నది ఒక చర్చ అయితే సతీష్ రెడ్డి వంటి వారు అన్నా చెల్లెళ్ళు కలసిపోవచ్చు అని చెబుతున్నారు అంటే ఆలోచించాల్సిందే. మొత్తానికి చూస్తే ఇది మంచి పరిణామమే అవుతుంది. అందరూ ఆహ్వానించాల్సిందే అవుతుందని కూడా అంటున్నారు.
