అసెంబ్లీకి జగన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారా ..!
11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సభకు వెళ్లాలని, సమస్యలు ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం ఉంటుందని సొంత పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.
By: Garuda Media | 30 July 2025 6:00 PM ISTవచ్చేనెల చివరి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది.. ఈ దఫా ఆయన సభకు వస్తారా వర్షాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారా అనేది ఆసక్తిగా మారింది. గత ఏడాది కాలంలో సభకు రాని విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సభకు వచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే సొంత పార్టీలోనూ అదే విధంగా ప్రతిపక్షాల నుంచి కూడా సభకు వెళ్లాలి అన్న డిమాండ్ అయితే పెరుగుతుంది.
11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సభకు వెళ్లాలని, సమస్యలు ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశం ఉంటుందని సొంత పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టుల నుంచి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలు గెలిపించినప్పుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత జగన్ పై ఉంటుందన్నది వారు చెబుతున్న మాట. ఈ క్రమంలో వర్షాకాల సమావేశాల్లో జగన్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని ప్రస్తుతం తాడేపల్లి వర్గాల్లో చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ప్రజల్లో సింపతి ఎలా ఉంటుంది? ప్రజలు వైసిపిని ఇంత ఘోరంగా ఓడించిన తర్వాత ఒకింత ఇబ్బందికర పరిస్తితిని జగన్ ఎదుర్కొన్నారు.
అయితే ఇటీవల కాలంలో చేపట్టిన పర్యటనలు వైసీపీలో జోష్ నింపాయి. ముఖ్యంగా జగన్ బయటకు రావాలన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా జగన్ బయటకు వస్తే సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఈ పరిణామాలు అంచనా వేసి సభకు రావడం ద్వారా ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే అవకాశం ఉందన్న వాదన సీనియర్ నాయకుల నుంచి వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇంకా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన వైసిపి తరఫున పోరాటాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్తున్నారు.
అయితే, ఇవి ప్రజా పోరాటాలా? సభ సమరాల అనేదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పార్టీ తరఫున గెలిచిన 11 మందిలో ఐదారుగురు సభకు వెళ్లాలని భావిస్తున్నారు. తద్వారా సమస్యలు ప్రస్తావించడం తోపాటు నియోజకవర్గాలకు నిధులు సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల్లో ఎమ్మెల్యే పనిచేస్తున్నారు అన్న భావనను కల్పించేందుకు అవకాశం ఉంటుందని వారు అంచనా వేసుకుంటున్నారు. వాస్తవానికి గతంలోనే కొందరు ఈ ప్రతిపాదన చేశారు. కానీ జగన్ మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
