Begin typing your search above and press return to search.

మీ టైమూ మా టైమూ....జగన్ సంచలన కామెంట్స్ !

ఎపుడైనా ఎవరి జీవితాన్ని అయినా మార్చేసేది టైం అన్నది తెలిసిందే. టైం బాగుంటే అన్నీ కలసి వస్తాయి. టైం బాగులేకపోతే మాత్రం ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టం.

By:  Satya P   |   25 Aug 2026 11:01 PM IST
మీ టైమూ మా టైమూ....జగన్ సంచలన కామెంట్స్ !
X

ఎపుడైనా ఎవరి జీవితాన్ని అయినా మార్చేసేది టైం అన్నది తెలిసిందే. టైం బాగుంటే అన్నీ కలసి వస్తాయి. టైం బాగులేకపోతే మాత్రం ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పడం కష్టం. ప్రతీ వారూ టైం ని బాగా నమ్ముతారు కానీ రాజకీయ నాయకులు అంతకు మించి నమ్ముతారు. టైం తమకు కలసి వస్తుందని ఎంతగానో విశ్వసిస్తారు. ఇక ఇదే మాటను వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేరే సౌండ్ లో వినిపించారు. ఆయన తాడేపల్లి లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ ఇంచార్జిలతో ఒక్క విషయం స్పష్టం చేశారు. రేపటి టైం మనదే అన్నారు. ఆ విషయం పోలీసులకు చెప్పండి అని కూడా అన్నారు. కళ్ళు మూసి తెరచేలోగా కూటమి ప్రభుత్వం పాలన ముగుస్తుందని ఆ మీదట వచ్చేది అచ్చంగా వైసీపీ పాలనే అన్నారు. వారికి గట్టిగా రెండేళ్ళు టైం ఉంటే వైసీపీకి అయిదేళ్ళ టైం ఉందని అంటూ ఇదే విషయం వైసీపీని ఇబ్బంది పెట్టే పోలీసులకు చెప్పాలని కోరారు.

డిజిటల్ బుక్ లో రాయండి :

స్థానిక సంస్థల ఎన్నికల గురంచి పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో ఇబ్బందులు వస్తాయని తెలుసు అని చెప్పారు. ఎవరైనా అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీని నియంత్రించాలని చూస్తే కనుక వారికి ఫుల్ క్లారిటీగా చెప్పాల్సింది ఇదే అన్నారు. మేము అధికారంలోకి వస్తున్నామని వారికి తెలియచేయాలని అన్నారు. పోలీసులు న్యాయంగా పనిచేయాలని కోరాలని వైసీపీ నేతలకు సూచించారు. ఒక వేళ వారు అలా వినకపోయినా పని చేయకపోయినా వారి ఖర్మ అనుకుని అలాంటి వారి పేర్లను డిజిటల్ బుక్ లో రాయండి అని జగన్ కోరారు. ఆ తర్వాత 2029 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక తప్పనిసరిగా వారి మీద చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు. వారు ఎక్కడ ఉన్నా కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా జగన్ పేర్కొన్నారు.

ధీమాగానే వైసీపీ :

వచ్చేది తమ ప్రభుత్వమే అని వైసీపీ ధీమాగా ఉంది. అందుకే జగన్ ఈ విధంగా చెప్పారు అని అంటున్నారు. కూటమికి అక్షరాలా రెండేళ్ళు మాత్రమే పదవీ కాలం ఉందని జగన్ అంటున్నారు. కూటమికి ఏ అధికారి కొమ్ము కాసినా ఉపేక్షించవద్దు అని కూడా సూచించారు. ఎన్నికలు న్యాయంగా జరిపించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద పోలీసుల మీదనే ఉందని జగన్ అన్నారు. అలా కాదు అనుకుంటే మాత్రం వైసీపీ వారి మీద దృష్టి పెడుతుందని అన్నారు. ఈ రోజు మీ టైం అనుకుంటే రేపు మా టైం కచ్చితంగా వస్తుందని జగన్ అన్నారు.

ఏకగ్రీవం వద్దే వద్దు :

ఏపీలో పంచాయతీ వార్డు నుంచి మేయర్ దాకా జరిగే ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం జరిగింది అన్న మాటే వద్దు అని జగన్ అన్నారు. ఆ విషయంలో ఏమి చేస్తారో కానీ పట్టుదలగా వ్యవహరించాల్సిందే అని జగన్ అన్నారు. రానున్న అరవై డెబ్బై రోజులు ఎంతో కీలకం అని జగన్ చెప్పారు. ప్రజలు కూటమి పాలన పట్ల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వైసీపీ నేతలు అంతా వినియోగించుకోవాలని జగన్ కోరారు. ఎక్కడైతే ఏకగ్రీవాలు జరుగుతాయో ఆయా చోట్ల ఇంచార్జిలుగా ఉన్న వారికి ఎమ్మెల్యే సీటు ఉండదని జగన్ హెచ్చరించడం విశేషం. మొత్తానికి మీ టైమూ మా టైమూ అంటూ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ ఎపుడూ ఎక్కువగా రోటీన్ స్పీచ్ ఇస్తూంటారు అని ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఉంటాయి. కానీ తాజాగా ఆయన మాట్లాడిన మాటలలో ఈ తరహ కొత్త పంచులు సెటైర్లు చోటు చేసుకోవడం విశేషం. దాంతో వైసీపీ శ్రేణులలో జోష్ అయితే కనిపిస్తోంది.