జగన్ పాదయాత్రకు కౌంటర్ గా లోకేష్ పాదయాత్ర ?
ఏపీలో సరికొత్త రాజకీయ పరిణామాలతో 2027 హీటెక్కబోతోంది. ఎందుకంటే వైసీపీ ఈపాటికే వచ్చే ఏడాదికి పాదయాత్ర ఉంటుందని చెబుతోంది.
By: Satya P | 5 Sept 2026 9:23 AM ISTఏపీలో సరికొత్త రాజకీయ పరిణామాలతో 2027 హీటెక్కబోతోంది. ఎందుకంటే వైసీపీ ఈపాటికే వచ్చే ఏడాదికి పాదయాత్ర ఉంటుందని చెబుతోంది. అధినేత వైఎస్ జగన్ తనకు అచ్చి వచ్చిన అధికారానికి ద్వారాలు తెరచిన పాదయాత్రనే నమ్ముకున్నారు. 2017 నవంబర్ 6న ఆయన పాదయాత్ర చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో సీఎం సీటు దక్కింది. ఈసారి కూడా అదే ఫార్మూలాతో జగన్ ఉన్నారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే పాదయాత్రకు ఆయన వ్యూహం రచించారు. గతంలో ఏణ్ణర్థం ముందు పాదయాత్ర చేస్తే ఈసారి దానికి రెండేళ్ళకు పొడిగించారు.
గ్రామాలే టార్గెట్ :
ఇదిలా ఉండగా అప్పట్లో 3700 కిలోమీటర్ల పాదయాత్ర చేపడితే ఈసారి అయిదు వేల కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు అని వార్తలు వెలువడుతున్నాయి. ఈసారి పూర్తిగా గ్రామాల గుండా జగన్ పాదయాత్ర సాగనుంది అని అంటున్నారు. ఏపీలో గ్రామాల సంఖ్య చూస్తే 17 వేల 300కి పైగా ఉంది. రెండేళ్ళు అంటే 730 రోజులు. మధ్యలో అడపా దడపా విశ్రాంతి విరామం తీసుకున్నా రోజుకు మూడు గ్రామాలు వంతున జగన్ పాదయాత్ర చేపట్టేలా డిజైన్ చేస్తున్నారు. వైసీపీకి బలం అంతా రూరల్ సెక్టార్ లోనే ఉంది. దాంతో పాటు సంక్షేమ పధకాలను అధికంగా పొందిన లబ్దిదారులు అక్కడే ఉన్నారు. ఇక రైతులు చిన్న వృత్తులు ఇతర వర్గాలు సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ తమకు పల్లెలలోనే అనుకూలిస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. దాంతో జగన్ పాదయాత్ర పూర్తిగా గ్రామ సీమలోనే సాగనుంది.
యాంటీ ఇంకెంబెన్సీ మీదనే :
వైసీపీ పూర్తిగా కూటమి ప్రభుత్వ పాలన వ్యతిరేకత మీదనే ఆశలు పెట్టుకుంది. సహజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. దానినే విపక్షాలు టార్గెట్ చేస్తాయి. అయితే టీడీపీ అయితే వైసీపీ ప్రభుత్వం మీద వచ్చిన యాంటీ ఇంకెంబెన్సీ మీదనే పూర్తిగా ఆధారపడకుండా తమకంటూ ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసి జనం ముందుంచింది. అందులో అమరావతి రాజధాని సాగు నీటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు అభివృద్ధి అజెండా ఉంది. ఇక వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అంటూ సూపర్ సిక్స్ తో వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లో పడేసి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
అభివృద్ధి అజెండా:
ఇక వైసీపీ సంక్షేమం విషయంలో తాము చేసినవి చెప్పుకుంటుంది. అంతే కాదు మరిన్ని ఇస్తామని కూడా హామీ ఇవ్వవచ్చు. ఆ వర్గం ఓటర్లలో వైసీపీకి సానుకూలత రావచ్చు. అయితే దానితో పాటుగా అభివృద్ధి అజెండాను వైసీపీ చూపించాల్సి ఉంది. మరి వైసీపీకి రాజధాని విషయంలో స్పష్టత లేదని అంటున్నారు. మావిగన్ అని వైసీపీ చెప్పినా అప్పటికి అమరావతి మొదటి దశ పూర్తి అయి కళ్ల ముందు ఉంటుంది. దాంతో అది వీగిపోతుంది. అలాగే పోలవరం కూడా కూటమి మొదటి దశను పూర్తి చేస్తుంది. సాగు నీటి ప్రాజెక్టులను వరసగా చేసుకుంటూ వెళ్తోంది. పెట్టుబడులు తెస్తున్నామని కూటమి చెప్పడమే కాదు కొన్ని గ్రౌండింగ్ కూడా ఆనాటికి అవుతాయి. దాంతో వైసీపీ విమర్శలు ఏ మేరకు జనంలోకి వెళ్తాయన్నది ఒక చర్చగా ఉంది.
కౌంటర్ గా లోకేష్ :
సరిగ్గా ఇదే విషయం మీద వైసీపీని జనంలోనే ఉంచి కార్నర్ చేయాలని టీడీపీ భావిస్తోంది. తాము చేసిన అభివృద్ధిని ఇచ్చిన సంక్షేమాన్ని జనంలో చెప్పుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. జగన్ పాదయాత్ర ద్వారా యాంటీ ఇంకెంబెన్సీ వైసీపీ వైపు పోకుండా దానిని నియంత్రించేలా ఇంకెంబెన్సీ కూటమి వైపు ఉండేలా లోకేష్ కౌంటర్ పాదయాత్రతో జనం ముందుకు వస్తారని అంటున్నారు. జగన్ పర్యటించిన చోటనే ఆయన వెంబడే లోకేష్ పాదయాత్ర కూడా సాగుతుందని అంటున్నారు. అంటే జగన్ కూటమి మీద చేసే ప్రతి విమర్శకూ లోకేష్ గట్టిగా జవాబు ఇస్తూ వైసీపీని ఎక్కడికక్కడ వీక్ చేయాలని భారీ యాక్షన్ ప్లాన్ తో రెడీ అవుతున్నారని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే దాదాపుగా ఒకే సమయంలో జగన్ లోకేష్ పాదయాత్రలు ఏపీలో స్టార్ట్ అవుతాయని అంటున్నారు. నిజానికి ప్రతిపక్షమే పాదయాత్రలు చేస్తుంది. కానీ ఫస్ట్ టైం అధికార పక్షం వైపు నుంచి కూడా పాదయాత్ర ఉంటే కనుక ఏపీ రాజకీయం హోరెత్తిపోవడం ఖాయమని అంటున్నారు.
