Begin typing your search above and press return to search.

జగన్ కి మద్దతు ఇచ్చే పార్టీలేవీ ?

ఏపీలో ఒక కొత్త అంశం మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అని అంటున్నారు.

By:  Satya P   |   13 Sept 2025 9:05 AM IST
జగన్ కి మద్దతు ఇచ్చే పార్టీలేవీ ?
X

ఏపీలో ఒక కొత్త అంశం మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అని అంటున్నారు. మెడికల్ కాలేజీలు వైసీపీ తమ క్రెడిట్ గా చెప్పుకుంటోంది వైసీపీ కేవలం బటన్ నొక్కి సంక్షేమం మాత్రమే ఇస్తూ వచ్చిందని అభివృద్ధిని అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు అని ఇంతకాలం విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ తాము ఎంతగానో అభివృద్ధి చేశామని అయితే తాము బయటకు పెద్దగా చెప్పుకోలేదని అన్నారు. తమ పార్టీ వారు గేర్ మార్చకపోవడం వల్లనే ఈ పరిస్థితి అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ పోరాటానికి సిద్ధం :

ఇపుడు ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం నిర్మించాలని చూస్తోంది. అయితే ఇది ప్రైవేటీకరణ అని వైసీపీ పెద్ద గొంతుతో ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలు ఉంటే పేద విద్యార్థులకు చదువు ఉచితంగా వస్తుందని సీట్లు పెద్ద ఎత్తున దొరుకుతాయని అలాగే నాణ్యమైన వైద్యం పేదలకు ఉచితంగా దక్కుతుందని జగన్ చెప్పుకొస్తున్నారు. పేదలకు వైద్య విద్యను వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తోంది అని ఆయన మండిపడుతున్నారు. మొత్తం 17 వైద్య కళాశాలకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి మౌలిక సదుపాయాలు అన్నీ కలిస్తే లక్ష కోట్ల ప్రజా సంపద అని కూడా అంటున్నారు. తాము ఈ సంపదను సృష్టిస్తే ప్రైవేట్ కి ఇస్తారా అని ఆయన అంటున్నారు. దీని మీద జనంలోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు

రెండిందాల లాభంగా :

ఇది సీరియస్ ఇష్యూగా వైసీపీ భావిస్తోంది. వైద్యం అంటే కనీస అవసరం కాబట్టి జనాలు కనెక్ట్ అవుతారు అని అంటున్నారు. అంతే కాదు తాము ఏపీకి ఏమి అభివృద్ధి చేశామో చెప్పుకునే చాన్స్ ఉంటుంది అని కూడా అంటున్నారు. సహజంగానే ప్రైవేటీకరణ అంటే జనాలలో వ్యతిరేకత ఉంటుంది. దాంతో తమ పోరాటానికి మద్దతు దక్కుతుందని ఆ మీదట ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గినా రాజకీయంగా పైచేయి సాధించినట్లుగా ఉంటుందని తమ క్రెడిట్ గా వైద్య కళాశాలల నిర్మాణం అన్నది ఏపీ ప్రజల మనసులలో బలంగా చొచ్చుకుని వెళ్తుందని కూడా లెక్క వేస్తున్నారు.

అన్ని పార్టీలకు పిలుపు :

ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ మరో పిలుపు ఇస్తోంది. అన్ని పార్టీలు కదలాలని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవాలని జగన్ కోరుతున్నారు. కలసి వచ్చే పార్టీలతో పోరాటం ఉధృతం చేస్తామని కొన్ని చోట్ల తాను కూడా ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటానని ఆయన చెబుతునారు. ఈ విధంగా కలసి వచ్చే పార్టీల గురించి జగన్ మాట్లాడుతూ అంతా ముందుకు రావాలని కోరుతున్నారు. మరి ఆ కలసి వచ్చే పార్టీలు ఏవి అన్న చర్చ కూడా జరుగుతోంది.

కాంగ్రెస్ కమ్యూనిస్టులేనా :

ఏపీలో వైసీపీ కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టులు విపక్షంలో ఉన్నారు. అయితే ఇప్పటిదాకా ఎవరి ఆందోళన వారిదే అన్నట్లుగా సీన్ ఉంది. వైసీపీ విపక్షంలో పెద్ద పార్టీగా మిగిలిన వారిని కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు. కానీ మెడికల్ కాలేజీల అంశంలో అందరినీ కలసి రమ్మంటోంది. మరి వైసీపీ పిలుపునకు ఎవరు రెస్పాండ్ అవుతారు అన్నదే చర్చగా ఉంది. కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ఉన్నారు. ఆమె తాజాగా మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరారు. అయితే జగన్ తో ఆమెకు ఉప్పు నిప్పుగా ఉంది మరి కాంగ్రెస్ నేతలు ఎవరు పాల్గొంటారు అన్నది చూడాల్సి ఉంది. అలాగే వామపక్షాలు కూడా ఈ అంశం మీద ఏ రకమైన స్టాండ్ తీసుకుంటాయన్నది ఆలోచించాలని అంటున్నారు. ప్రైవేటీకరణకు ఎపుడూ వామపక్షాలు వ్యతిరేకమే కానీ వారు విడిగా నిరసనలు చేస్తారా లేక ఏమి చేస్తారు అన్నది చూడాలని అంటున్నారు. మొత్తానికి అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెబుతున్న వైసీపీకి సహకరించే విపక్షాలు ఏవి అన్నదే ఒక చర్చగా ఉందిపుడు.