జగన్ ముందే భయ పెట్టేస్తున్నారు!
వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికల తర్వాత.. తాము అధికారంలోకివస్తే.. ఏం చేస్తారో చెబుతూ.. ముందుగానే భయపెడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
By: Garuda Media | 24 Sept 2026 11:00 AM ISTవైసీపీ అధినేత జగన్.. వచ్చే ఎన్నికల తర్వాత.. తాము అధికారంలోకివస్తే.. ఏం చేస్తారో చెబుతూ.. ముందుగానే భయపెడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో కూటమి సర్కారు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు.. ఎవరు ముందు వచ్చినా.. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని జగన్ హెచ్చరించారు. దీంతో ఒక్కరు కూడా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఇక, ఆ తర్వాత.. కూడా పెట్టుబడి దారుల విషయంపైనా జగన్ ఇలానే వ్యాఖ్యలు చేశారని.. తరచుగా చంద్రబాబు చెబుతున్నారు.
ఇక, తాజాగా విశాఖపట్నంలో పెట్టుబడి దారులకు భూములకేటాయింపు విషయంపైనా జగన్ ఇదే వైఖరి ప్రదర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. భూముల విషయాన్ని నిగ్గు తేలుస్తామని చెప్పారు. 99 పైసలకే ఎకరం భూమి ఎలా ఇస్తారని.. చాక్లెట్ కూడా రాదుకదా.. అని వ్యాఖ్యానించిన ఆయన.. తాము అధికారంలో వస్తే.. ఇలాభూములు పొందిన సంస్థలపై విచారణకు ఆదేశిస్తామన్నారు. అదేసమయంలో సదరు భూముల లీజులను కూడా రద్దు చేయనున్నట్టు వివరించారు. చంద్రబాబు తనది కాకపోతే.. ఏదైనా ఉచితంగా ఇచ్చేస్తారని ఈ సందర్భంగా జగన్ ఎద్దేవా చేశారు.
విశాఖలో ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం విద్యాసంస్థలకు 55 ఎకరాలను ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన జగన్.. 99 పైసల చొప్పున ఎకరా భూమిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిని తాము అధికారంలోకి రాగానే రద్దుచేస్తామని ప్రకటించారు. ప్రజల సొమ్మును ఇలా ఇచ్చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు. తమ హయాంలో కూడా కొన్ని సంస్థలకు భూములు కేటాయించామన్న ఆయన.. నిబంధనల ప్రకారం వ్యవహరించామని చెప్పారు. ఇప్పుడు మాత్రం తమ కుటుంబాలకు.. తమ వ్యాపార భాగస్వాములకు మాత్రం ఎకరా 99 పైసలకు భూములు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు.
ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో కూటమి సర్కారు పెట్టుబడుల పేరుతో హడావుడి చేస్తోందని జగన్ ఆరోపించారు. ఈ పెట్టుబడులు ఏంటో.. వాటి సంగతేంటో ఎవరికీ అర్ధం కావడం లేదని.. పేదల భూములు, రైతుల భూములను మాత్రం కూటమి ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరిగా పంచి పెడుతోందని ఆరోపించారు. వీటన్నింటిపైనా విచారణకు ఆదేశిస్తామన్నారు. మొత్తంగా తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెబుతూ.. ఆయా వర్గాలను భయోత్పాతానికిగురి చేయడం ద్వారా పెట్టుబడులను అడ్డుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
