క్రాంతికుమార్ కుటుంబానికి జగన్ పరామర్శ
పోలీసు రికార్డుల్లో సస్పెక్టు రౌడీ షీటర్‌గా ఉన్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు.
By: Garuda Media | 2 July 2026 9:34 PM ISTపోలీసు రికార్డుల్లో సస్పెక్టు రౌడీ షీటర్‌గా ఉన్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. కొన్నాళ్ల కిందట క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగ రాజు (ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు) వేధిస్తున్నాడని, మూడు మాసాలుగా స్టేషన్‌కు పిలిచి కొడుతున్నాడని ఆరోపించారు. దీంతో తనకు జీవితంపైనే విరక్తి కలిగిందని సెల్ఫీ వీడియో తీసుకుని గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ కుటుంబాన్ని తాజాగా పరామర్శించిన జగన్.. క్రాంతి కుటుంబానికి అన్యాయం జరిగిందని.. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. క్రాంతికుమార్ కుటుంబసభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. క్రాంతికుమార్ ట్యాక్సీ నడుపుతూ.. జీవిస్తున్నాడని తెలిపారు. అతనిని అకారణంగా నాగరాజు వేధించారని, మూడు నెలలుగా స్టేషన్‌కు పిలిచి వేధించారని పేర్కొన్నారు. టార్చర్ చేశారని ఆరోపించారు.
దీంతో జీవితంపైనే విరక్తి కలిగిన క్రాంతి కుమార్.. ఆత్మహత్య చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. పోలీసులు చేయకూడని పనులను క్రాంతికుమార్‌తో బెదిరించి చేయించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజీ ఎందుకు డిలీట్ చేశారని జగన్ మరోసారి ప్రశ్నించారు. చేయాల్సిన నేరాలు చేసేసి.. సీఐని సీపీ.. సీపీని డీజీపీ.. డీజీపీని సీఎం రక్షిస్తున్నారని విమర్శించారు. నిజాలు నిగ్గు తేలాలంటే.. ఈ కేసులను స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా.. జగన్ పరామర్శ యాత్ర పార్టీ కార్యక్రమంలా నిర్వహించారన్న విమర్శలు వచ్చాయి. భారీ ఎత్తున పార్టీ శ్రేణులను సమీకరించారు. వీధి వీధిలోనూ పార్టీ జెండాలు కట్టారు. అయితే.. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న నాయకుడు ఈ పని చేశారని.. పరామర్శకు వచ్చినప్పుడు ఇవన్నీ తగవని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాలకు.. పరామర్శలకు తేడా ఉందని ఆయన చెప్పడం గమనార్హం. అయితే.. దీనిని జగన్ పట్టించుకోలేదు.
