Begin typing your search above and press return to search.

జగన్ పరామర్శ సంగతేమో కానీ... జోగికి సరికొత్త సమస్య!

ఈ సమయంలో మరికొంతమంది కార్యకర్తలు టూవీలర్ సైలెన్సర్ లు తీసేసి నేషనల్ హైవేపై వేగంగా దూసుకెళ్తూ.. ఒంటి చేత్తో చుట్టూ గుండ్రంగా తిప్పి స్టంట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు.

By:  Raja Ch   |   7 Feb 2026 10:36 AM IST
జగన్  పరామర్శ సంగతేమో కానీ... జోగికి సరికొత్త సమస్య!
X

తన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమస్యలు వస్తే అధినేత జగన్ వారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనల్లో జన సమీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండగా.. పలువురు కార్యకర్తలు చేస్తున్న పనులు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. అవి అటు తిరిగి, ఇటు తిరిగి జగన్ పరామర్శించడానికి వెళ్లిన నేత మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా జోగి రమేష్ విషయంలో అదే జరిగింది. మేటర్ సీరియస్ అయ్యింది.

అవును... టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే! ఈ విషయం తీవ్ర కలకలం రేపింది! ఈ క్రమంలో జోగి రమేష్ ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు చేసినపనులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఇదేమి అత్యుత్సాహం అనే విమర్శలను సొంతం చేసుకుంటున్నాయి.

జగన్ పరామర్శ యాత్ర నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలను ఆపేసి పలువురు కార్యకర్తలు హల్ చల్ చేయడం.. రహదారికి పక్కన నిలబడాలని చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులపై ఆగ్రహావేశాలతో ఊగిపోవడం.. తమ టైం వచ్చిన తర్వాత చెప్తామంటూ బెదిరింపులకు దిగారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ సమయంలో మరికొంతమంది కార్యకర్తలు టూవీలర్ సైలెన్సర్ లు తీసేసి నేషనల్ హైవేపై వేగంగా దూసుకెళ్తూ.. ఒంటి చేత్తో చుట్టూ గుండ్రంగా తిప్పి స్టంట్లు చేస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెలరేగారు!

ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇందులో భాగంగా.. జగన్ పర్యటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి, బైక్ ర్యాలీ నిర్వహించి, పబ్లిక్ న్యూసెన్స్ చేశారని.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించారంటూ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఎస్.ఐ. రవి వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'అబద్ధాలు ఆడుతూ ప్రజలను పెడదోవ పట్టించారు'!:

మరోవైపు జోగి రమేష్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అనే అంశంపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి అబద్ధాలు చెబుతూ ప్రజలను చంద్రబాబు పెడదోవ పట్టించారని సీబీఐ ఛార్జిషీట్ చూస్తే తేటతెల్లమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా.. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయో బయటపెట్టాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను జగన్ ప్రశ్నించారు!

సీబీఐ (సిట్) ఛార్జిషీట్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.డీ.డీ.బీ), నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్.డీ.ఆర్.ఐ) ల్యాబ్ రిపోర్టులను ప్రస్తావిస్తూ.. ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్లుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలు ఎలాంటి తప్పు చేయలేదని కూడా సీబీఐ తేల్చేసిందని జగన్ తెలిపారు.