Begin typing your search above and press return to search.

జగన్ కి హైప్ పెంచుతున్న టీడీపీ

జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టులో కలవాలని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకుల బృందం వచ్చింది.

By:  Satya P   |   9 Oct 2025 3:00 PM IST
జగన్ కి హైప్ పెంచుతున్న టీడీపీ
X

గతంలో జగన్ ఏ తప్పులు అయితే చేశారో ఇపుడు అధికారంలో ఉన్న టీడీపీ సైతం అదే రకమైన తప్పులు చేస్తోంది. దానికి అధికారం మత్తుగా చూడాలో లేక టిట్ ఫర్ టాట్ స్ట్రాటజీ అనుకోవాలో తెలియడం లేదు కానీ జగన్ విషయంలో మాత్రం పొరపాట్లు చేస్తూ వాటినే అలవాటుగా మార్చుకుంటోంది. వైఎస్ జగన్ వైఖరి చూస్తే జనంలోకి వచ్చేదే తక్కువగా ఉంటుంది. ఆయన చంద్రబాబు మాదిరిగా ప్రతీ రోజూ జనంలో ఉంటూ ఒకటికి మించి సభలు సమావేశాలలో పాల్గొనే వారు కారు అన్నది తెలిసిందే. ఆయన ఈ మధ్య కాలంలో చూస్తే నెల్లూరు టూర్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ విశాఖ పర్యటన పెట్టుకున్నారు. జగన్ పర్యటన అనగానే టీడీపీ తమ్ముళ్ళు ఎందుకో పూనకాలు పోతూ ఉంటారు, ఆయన మీద పోటీలు పడుతూ విమర్శలు చేస్తూ ఉంటారు. మీడియా ముందు అంతా జగన్ జపం చేస్తూ అందులోనే తరిస్తూ ఉంటారు.

మళ్ళీ అదే తీరు :

వైసీపీ అధినేత మాజీ సీఎం, విపక్ష నేతగా ఉన్నారు. ఆయన పర్యటన విషయంలో పోలీసులు కూడా అదే తీరుని చూపిస్తున్నారు. మొదట జగన్ పర్యటనకు అనుమతి లేదని చెప్పారు, ఆ తరువాత ఆంక్షలతో కూడిన అనుమతి అన్నారు, కొన్ని వాహనాలే రావాలి, కొంతమంది జనాలే ఉండాలి అని రూల్స్ ఏవో వల్లిస్తున్నారు. నిజానికి ఇవన్నీ అయ్యే పనేనా ఎంత మంది జనాలు రావాలో ఎవరు నిర్ణయిస్తారు, ఒక నాయకుడు వచ్చినపుడు వెంట వెళ్ళేవారు ఉంటారు, వారిని ఆపడం కూడా కష్టమే. అదే ఆపేసినా దాని వల్ల వచ్చే లాభమేదీ లేకపోగా నెగిటివిటీ వస్తుంది అన్నది కూడా ఆలోచించాలి కదా అని అంటున్నారు.

అడ్డుకోవడం ద్వారా :

జగన్ ని విశాఖ ఎయిర్ పోర్టులో కలవాలని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకుల బృందం వచ్చింది. వారు అయితే చాలా రోజులుగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలో ఉన్నారు. ఈ మధ్యనే హోం మంత్రి అనితను సైతం వారు అడ్డుకుని తన నిరసన తెలిపారు. ఇపుడు వారు తమ డిమాండ్ ని మరింత గట్టిగా వినిపించే క్రమంలో విపక్ష నేతను కలవాలని చూస్తున్నారు మామూలుగా అయితే ఇందులో తప్పేమీ లేదు, ప్రజా స్వామ్యంలో ఎవరు ఎవరిని అయినా కలవవచ్చు కానీ అలా కలిసేందుకు వీలు లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారంతా మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పటికే ప్రభుత్వం తీరు మీద మండుతున్న వారు ఇంకా వ్యతిరేకం అవుతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఇవేమి రూల్స్ అని అంటున్న వారూ కూటమిలో ఉన్నారని అంటున్నారు

ఫ్లెక్స్లీల గోల...నినాదాల లీల :

జగన్ నర్శీపట్నం వస్తున్నారు అంటే అపుడెపుడో మరణించిన డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీని పెద్ద సైజ్ లో పెట్టి మరీ జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు. అలాగే జగన్ గో బ్యాక్ అని మహిళలు ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శనకు దిగారు ఇవన్నీ కూడా రాజకీయంగా బాగానే ఉంటాయి కానీ చూసే తటస్థ జనాలకు మాత్రం వేరే ఆలోచనలు కలిగిస్తాయి. జగన్ పర్యటన అంటే ఇంత ఉలికిపాటా ఆయనకు అంత బలం ఉందని భయమా అన్న సంకేతాలు కూడా జనంలోకి పోవడానికి ఈ తీరే కారణం అని అంటున్నారు. అంతే కాదు జగన్ వస్తున్నారు అన్నది వైసీపీ కంటే ఎక్కువగా ప్రత్యర్థులే జనాలలో ప్రచారం చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు.

నాడు చేశారు అంటూ :

ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లు కూడా జగన్ విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఆనాడు విశాఖకు చంద్రబాబు వస్తే ఎయిర్ పోర్టులో ఆపిచారని, అలాగే పవన్ ని కూడా ఒక హొటల్ లో బయటకు రానీయకుండా చేశారు అని ఆరోపించారు. సరే అవన్నీ చేయబట్టే వైసీపీ ఈ రోజున 11 సీట్లకే పరిమితం అయి విపక్షంలో ఉంది అన్నది మరచిపోతే ఎలా అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. వారు తప్పు చేశారు అదే తప్పు కూటమి వైపు నుంచి కూడా ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆంక్షలు పెట్టి ఆటంకం కలిగిస్తే జనంలో ఇంకా కుతూహలం పెరిగి అది కాస్తా సానుభూతిగా మారుతుందని ఎందుకు గ్రహించడం లేదని అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ పర్యటన విషయంలో వైసీపీ నేతల కంటే కూటమి నేతలు అందునా టీడీపీ నేతల ఆయాసం ఆరాటం అధికంగా ఉందని అంటున్నారు. దీంతోనే బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు.