మూడు రోజులు...జగన్ మూడు ట్వీట్లు వైరల్ !
ఇక ముచ్చటగా మూడవ ట్వీట్ జగన్ వేసింది అయితే వైరల్ కా బాప్ అన్నట్లుగా సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది. అది కూడా రాజకీయంగా రచ్చ చేస్తోంది.
By: Satya P | 20 April 2026 1:19 PM ISTవరుసగా మూడు రోజులు వైసీపీ అధినేత చేసిన మూడు ట్వీట్లూ వైరల్ అయ్యాయి. నిజం చెప్పాలీ అంటే మామూలుగా అయితే అవి పెద్ద ఆసక్తిని పెంచేవి కావు. కానీ ఏపీ రాజకీయాలు కేంద్ర రాజకీయాలు జగన్ ఆలోచనలు వైసీపీ విధానాలు ఇవన్నీ చూసినపుడు జగన్ వేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ జోరు చేశాయనే చెప్పాలి. ఇంతకీ జగన్ చేసిన మూడు ట్వీట్లు కధా కమామీషూ ఏంటి అంటే వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటరే మరి.
మోడీకి మద్దతుగా :
ఇక ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకి వైసీపీ మద్దతు ఇచ్చింది. ఎలా ఇచ్చింది ఎందుకు అంటే అదొ సెపరేట్ స్టోరీ. న్యూట్రల్ పార్టీగా వైసీపీ తన స్టాండ్ తీసుకోవాలి కదా అన్నది చర్చ ఉండనే ఉంది. కానీ జగన్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి మహిళా బిల్లు డీలిమిటేషన్ కోసం మద్దతు ఇచ్చారు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రతిపక్షంలో ఉంటూ అధికారం పక్షానికి మద్దతు ఏమిటి అని జగన్ సొంత చెల్లెలు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇవన్నీ ఇలా ఉంటే మరింత బాహాటంగా వైసీపీ అధినేత బిల్లు వీగినందుకు ట్వీట్ చేస్తూ అందులో విపక్షాలను విమర్శించారు. దాంతో ఎన్డీయేకు అవుట్ రేట్ గా వైసీపీ మద్దతు ఇచ్చిన వైనం పూర్తి స్థాయిలో చర్చకు వచ్చింది. ఆ ట్వీట్ మీద పెద్ద రచ్చ కూడా జరిగింది.
రెండవ ట్వీట్ మరింతగా :
ఆ తరువాత జగన్ వేసిన రెండవ ట్వీట్ అయితే రాజకీయంగా ఏపీ తెలంగాణాల్లో చర్చకు తావిచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకున్నారు. దాంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని తిరిగి వేగంగా కోలుకుని ప్రజా సేవకు అంకితం కావాలని జగన్ చేసిన ట్వీట్ అయితే పూర్తి ఇంట్రెస్టింగ్ గా సాగింది. సోషల్ మీడియాని సూదంటు రాయిలా ఆ ట్వీట్ ఇట్టే ఆకట్టుకుంది. నిజానికి పవన్ హెల్త్ బాగుండాలని ఎంతో మంది ట్వీట్ చేశారు కానీ జగన్ చేసిన ట్వీటే ఇంతలా వైరల్ కావడం వెనక రాజకీయంగా ఈ ఇద్దరు ఉప్పు నిప్పుగా ఉండడమే అని అంటున్నారు. అయితే అవన్నీ రాజకీయాలు అని వ్యక్తిగతంగా జగన్ కి పవన్ కి మధ్య ఏమీ లేదని అందుకే ఒక సహ రాజకీయ నేతగా జగన్ అలా రెస్పాండ్ అయ్యారని అంటున్నారు. కానీ ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థులు పోయి చాలా కాలం అయింది అందుకే ఈ ట్వీట్ కి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది అని అంటున్నారు.
వైరల్ కా బాప్ :
ఇక ముచ్చటగా మూడవ ట్వీట్ జగన్ వేసింది అయితే వైరల్ కా బాప్ అన్నట్లుగా సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది. అది కూడా రాజకీయంగా రచ్చ చేస్తోంది. ఇంతకీ జగన్ వేసిన ఆ ట్వీట్ ఏంటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం. ఆయన ఆరోగ్యంగా ఉండాలని జగన్ కోరుకుంటూ ఈ ట్వీట్ వేశారు. దీంతో దీని మీద కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇక టీడీపీ వర్గాలు అయితే అన్ని ట్వీట్లూ ఒక ఎత్తు జగన్ ట్వీట్ మరో ఎత్తు అన్నట్లుగానే చూస్తున్నారు. కొందరు అయితే జగన్ ట్వీట్ కింద రీట్వీట్ చేస్తూ థాంక్యూ అని పెడుతున్నారు. మొత్తానికి వరుసగా మూడు రోజులు జగన్ వేసిన మూడు ట్వీట్లు మాత్రం తెగ వైరల్ కావడమే కాదు ఏపీలో అధికారంలో ఉన్న మూడు పార్టీలకు అనుకూలంగా ఉండడమే అసలైన విశేషంగా అంతా చెప్పుకుంటున్నారు.
