Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో దేవెగౌడ‌.. ఇప్పుడు జ‌గ‌న్‌.. సేమ్ టు సేమ్‌.. !

అదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే. కొన్ని కొన్ని ఘ‌ట‌న‌ల‌కు కార్యాకార‌ణ సంబంధం ఉంటుంది.

By:  Garuda Media   |   6 Nov 2025 10:05 AM IST
అప్ప‌ట్లో దేవెగౌడ‌.. ఇప్పుడు జ‌గ‌న్‌.. సేమ్ టు సేమ్‌.. !
X

అదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే. కొన్ని కొన్ని ఘ‌ట‌న‌ల‌కు కార్యాకార‌ణ సంబంధం ఉంటుంది. గ‌తం లో దేశ ప్ర‌ధానిగా ప‌నిచేసిన దేవెగౌడ గురించి పెద్ద ఎత్తున ఒక వాద‌న ప్ర‌చారం జ‌రిగింది. అది వాస్త‌వం కూడా. అయితే.. దానిని ఆయ‌న స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేకపోయారు. ఫ‌లితంగా.. `ఒక్క‌సారి ప్ర‌ధాని`గా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. త‌ర్వాత‌.. అవ‌కాశం త‌లుపు కాదు క‌దా.. వీధి వ‌ర‌కు కూడా రాలేదు. అచ్చంగా జ‌గ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంటుంద‌న్న జోరుగా సాగుతోంది.

దేవెగౌడ విష‌యంలో ఏం జ‌రిగిందో చూద్దాం.. కీల‌క‌మైన స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా బ‌లం పుంజు కోని స‌మ‌యంలో దేవెగౌడ ప్ర‌ధాని అయ్యారు. నిజానికి ఆ స‌మ‌యంలో ఆయ‌న పుంజుకుని ఉంటే.. ప్ర‌జ‌ల‌తో మార్కులు వేయించుకుని ఉంటే.. ఇక‌, దేశంలో ప్ర‌త్యామ్నాయ ప్ర‌ధాన మంత్రిగా ఆయ‌నే ఉండేవారు. కానీ, ఆయ‌న చేసిన నిర్ల‌క్ష్యం.. వేదిక‌ల‌పైనే నిద్ర‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించేందుకు కూడా.. `స‌మ‌యం ఉండుద‌య్యా` అంటూ.. వ్యాఖ్యానించ‌డం మైన‌స్ చేశాయి.

ఫ‌లితంగా జేడీఎస్ నాయ‌కులు(సొంత పార్టీ) సైతం దేవెగౌడ‌ను ప‌క్క‌న పెట్టారు. అనంత‌ర కాలంలో ఆయ న కుమారుడు కుమార‌స్వామి ప‌గ్గాలు చేప‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనంతటికీ కార‌ణం.. దేవెగౌడ అధికారం లో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌హ‌రించిన సంగ‌తులే. ఎవ‌రు ఎన్ని చెప్పినా.. ఆయ‌న మార‌లేదు. బ‌హిరంగ స‌భ‌ల నుంచి కేబినెట్ స‌మావేశాల వ‌ర‌కు ఆయ‌న నిద్ర పోయారు. ఇవి బాగా ప్రచారంలోకి వ‌చ్చి.. ఏకంగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత‌.. గ‌త 16 మాసాలుగా కూడా.. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఏమాత్రం సానుభూతికి నోచుకోవ‌డం లేదు. విప‌త్తులు వ‌చ్చినా.. విధ్వంసాలు జ‌రిగినా.. బ‌ట‌న్ నొక్కుతున్నాగా? అనే మాటే వినిపించేది. నేరుగా జ‌గ‌న్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఘ‌ట‌న ఒక్క ఎల్జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న సంద‌ర్భంలోనే. ఆ త‌ర్వాత‌.. క‌రోనా వ‌చ్చినా..ఏలూరులో క‌లుషిత నీరు.. ప్ర‌బావం చూపించినా.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పుడు కూడా ఆయ‌న తాడేప‌ల్లికే ప‌రిమితం అవుతున్నారు. హ‌ద్దులు దాటిన‌ నాయ‌కులపై అప్ప‌ట్లో చ‌ర్య‌లు కూడా తీసుకోలేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ ప‌రిస్థితి కూడా దేవెగౌడ మాదిరిగానే ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.