లోకేష్ ని టార్గెట్ చేసిన జగన్
వైసీపీ అధినేత మాజీ సీఎం టార్గెట్ ఎపుడూ చంద్రాబు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన నోటి వెంట వచ్చే పేరు అదే ఉంటుంది. ఇతర నేతల పేర్లు ఆయన పెద్దగా చెప్పరు.
By: Satya P | 26 July 2026 8:04 AM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం టార్గెట్ ఎపుడూ చంద్రాబు అన్నది అందరికీ తెలిసిందే. ఆయన నోటి వెంట వచ్చే పేరు అదే ఉంటుంది. ఇతర నేతల పేర్లు ఆయన పెద్దగా చెప్పరు. అంటే వారిని సమ ఉజ్జీలుగా ఆయన పరిగణించరు అని అంటారు. అది కూడా ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా చెబుతారు. అయితే ఇటీవల కాలంలో మాత్రం జగన్ నోటి వెంట చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు కూడా ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. బహుశా టీడీపీలో బాబు తరువాత ఆయనే అన్న సంకేతాలు బలంగా వెళ్తున్నందువల్లనే వైసీపీ ఈ విధంగా తన స్ట్రాటజీ మార్చింది అని అంటున్నారు.
బాధ్యుడిని చేస్తూ :
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు జరిగిపోయి ఫలితాలు వచ్చేసి ఉద్యోగాలు కూడా అందేసుకుని ఏడాదిగా అంతా పనిచేస్తున్నారు. ఇపుడు ఆ మెగా డీఎసీలో అవకతవకలు జరిగాయని వైసీపీ అంటోంది. దీని మీద ఇటీవల కాలంలో వైసీపీ విమర్శలు చేస్తోంది. తాజాగా చూస్తే కాక్రోచ్ దండు నీట్ పరీక్షల లీకేజ్ మీద ఉద్యమిస్తూండడంతో వైసీపీ కూడా మెగా డీఎస్సీని ఎంచుకుంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 తుది ఫలితాలు 2025 ఆగస్టు 11, 2025న విడుదలయ్యాయి. మొత్తం 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులు కోసం ఈ పరీక్షలు నిర్వహించారు.
వైసీపీ ఆందోళనలు :
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. పేపర్ లీకేజీలు, పారదర్శకత లోపించడం స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయసభలలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి సీబీఐ విచారణ జరపాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇక లోక్‌సభలో వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి మెగా డీఎస్సీ అక్రమాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామాకు సైతం వైసీపీ డిమాండ్ చేస్తోంది.
రాజకీయ కోణమేనా :
ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మెరిట్ జాబితాలు, రోస్టర్ విధానం సరిగా అమలు చేయలేదని దీనిపై కాలపరిమితితో కూడిన స్వతంత్ర లేదా సీబీఐ విచారణను కూడా వారు కోరుతున్నారు. మరో వైపు చూస్తే కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీని నిర్వహించి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశం మీద వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిందని కూడా గుర్తు చేస్తోంది. నిరుద్యోగులను రాజకీయ లబ్దికోసమే వైసీపీ రెచ్చగొడుతోందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది.
జగన్ రంగంలోకి :
ఇంతకాలం వైసీపీ నేతల వరకే ఈ ఇష్యూ ఉంది. వారి చేతనే పార్టీ అధినాయకత్వం ఎక్కువగా మాట్లాడిస్తోంది. జగన్ అయితే ఆ మధ్యన నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ అంశం ప్రస్తావించారు. కానీ ఇపుడు ఏకంగా తన ఎక్స్ ఖాతా ద్వారా నేరుగా లోకేష్ రాజీనామాకు ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో 3.5 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న మెగా డీఎస్సీ విషయంలో అవకతవకలు జరిగాయని జగన్ తాజాగా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేస్తూ అన్నారు. అందువల్ల లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఇది మెగా డీఎస్సీ కాదని, అభ్యర్థుల భవిష్యత్తును అంధకారం చేసే మెగా స్కామ్ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, ఈ మొత్తం నియామక ప్రక్రియపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద లోకేష్ ని టార్గెట్ చేశారు జగన్. ఈ విధంగా కొత్త వ్యూహంతో చంద్రబాబు మీదనే వైసీపీ రాజకీయ సమరానికి దిగుతోంది అని అంటున్నారు.
