స్థానిక ఎన్నికల్లో పోటీ.... జగన్ వ్యూహం ఇదే !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగవని జగన్ పార్టీ నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు. అంతమాత్రాన వైసీపీ ఎన్నికలను వదిలేసి దూరంగా వెళ్ళిపోదని అన్నారు.
By: Satya P | 10 Sept 2026 12:53 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ వైసీపీ ఎందుకు చేస్తుంది అంటే రాజకీయ పార్టీ కాబట్టి అని జవాబు రావచ్చు. అయితే వైసీపీ రెండేళ్ళ క్రితం దారుణంగా ఓటమి పాలు అయింది కదా, పైగా కూటమి అధికారంలో ఉంది కదా ఇంతలో మార్పు ఏమి వస్తుంది. కూటమి ఐక్యంగా ఉంది. మూడు పార్టీలు కలసి పోటీ పడుతున్న వేళ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఏమి ప్రయోజనం చేకూరుతుంది అన్న చర్చ ఉంది. అంతే కాదు ప్రజలు కూడా మరో మూడేళ్ళ పాటు అధికారం కూటమికే ఎటూ ఉంటుంది కాబట్టి కచ్చితంగా కూటమి అభ్యర్ధులకే జై కొడతారు అన్నది కూడా వాస్తవం. మరిన్ని విషయాలు తెలిసి వైసీపీ పోటీ పడడం ఎందుకు అంటే అక్కడే జగన్ మార్క్ వ్యూహం ఉంది అని అంటున్నారు.
కసి పెరగాలి అంటూ :
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగవని జగన్ పార్టీ నేతల సమావేశంలో చెప్పుకొచ్చారు. అంతమాత్రాన వైసీపీ ఎన్నికలను వదిలేసి దూరంగా వెళ్ళిపోదని అన్నారు. వైసీపీని నమ్ముకుని ప్రజలు ఉన్నారని వారి కోసం వారికి తోడుగా నిలబడేందుకు పోటీ చేయాల్సిందే అని జగన్ సూచిస్తున్నారు. అంతే కాదు పంచాయతీ వార్డు మెంబర్ విషయంలో కూడా కూటమి అసలు వదలదని పోలీసులను పెట్టి అధికార దుర్వినియోగం చేసి అయినా గెలిచేందుకు చూస్తుందని అన్నారు. అపుడు కచ్చితంగా ఆ వార్డు మెంబర్ గా పోటీకి దిగిన వైసీపీ కార్యకర్తకు కసి వస్తుందని అన్నారు, ఆ కసితోనే 2029 ఎన్నికల్లో కూటమిని ఓడించేందుకు పోరాటం చేసే స్పూర్తి వస్తుందని జగన్ విశ్లేషించారు. అందుకే పోటీ చేయమని తాను కోరుతున్నాను అని ఆయన చెప్పారు.
గెలుపు కంటే పోరాటం :
స్థానిక ఎన్నికల్లో అంతా సజావుగా సాఫీగా సాగితే వైసీపీ విజయం ఖాయమని జగన్ స్పష్టం చేశారు. అయితే అలా జరపనీయరని ఆయనే విమర్శించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం ఒక పోరాటం అని ఆయన అభివర్ణిస్తున్నారు. అలా పోరటం చేసిన వారే 2029 ఎన్నికల నాటికి వైసీపీ తరఫున నిలిచే గట్టి క్యాడర్ గా మారుతారు అని ఆయన చెప్పారు. ఇంతకు ఇంత కూటమి మీద కసి తీర్చుకోవడానికి ఎదురుచూసే ప్రతీ వైసీపీ కార్యకర్త ఒక శ్రీ క్రిష్ణుడు అవుతాడు అని జగన్ చెప్పారు. అందువల్ల 2029 ఎన్నికల్లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో వీరే కూటమిని ఓడించి వైసీపీకి విజయం సాధించి పెడతారు అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్తబ్ధుగా క్యాడర్ :
నిజానికి చూస్తే వైసీపీ క్యాడర్ అంతా స్తబ్దుగా ఉంది అని అంటున్నారు. ఎక్కడికక్కడ నాయకులు కానీ క్యాడర్ కానీ కో ఆర్డినేషన్ లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. స్థానిక ఎన్నికలను కనుక వైసీపీ సీరియస్ గా తీసుకోకపోతే ఆ పార్టీకి ఓటేసే అభిమానులు కానీ 40 శాతం ఓటు షేర్ ని కాపాడుకోవడానికే రంగంలోకి దిగుతోంది అని అంటున్నారు. మరి వైసీపీకి 2024లో వచ్చిన 40 శాతం ఓటు షేర్ అలాగే కొనసాగుతుందా లేక పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్నది కూడా ఈ లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు తెలియచేస్తాయి అని అంటున్నారు. చూడాలి మరి జగన్ చెప్పినట్లుగా క్యాడర్ లో కసి ఏ విధంగా ఉంటుందో.
