వైసీపీకి చుక్కలు చూపిస్తున్న మంత్రి నిమ్మల !
దాంతో పాటే ఆయన ఎపుడూ ఎక్కడైనా క్రమం తప్పకుండా వేసుకున్న పసుపు చొక్కా కూడా కళ్ళ ముందు కదలాడుతుంది.
By: Satya P | 30 July 2026 9:21 AM ISTపశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు సీటు గుర్తుకు వస్తే చాలు ఠక్కున మంత్రి నిమ్మల రామానాయుడు పేరు కూడా మారుమోగుతుంది. దాంతో పాటే ఆయన ఎపుడూ ఎక్కడైనా క్రమం తప్పకుండా వేసుకున్న పసుపు చొక్కా కూడా కళ్ళ ముందు కదలాడుతుంది. నిమ్మల టీడీపీకి కరడు కట్టిన నేత. ఆయన టీడీపీని శ్వాసిస్తారు అని చెప్పడం కూడా సబబు. ఆయన పాలకొల్లు నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో తొలిసారి గెలిచిన ఆయన 2024లోనూ అదే విజయన్ కంటిన్యూ చేశారు. ఈసారి మెజారిటీ కూడా అదిరిపోయే విధంగా వచ్చింది. దాంతో ఆయన ఏకంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి కూడా అయిపోయారు.
కంచుకోట అంటే అదే :
ఇక టీడీపీకి కూడా కంచుకోట లాంటి సీటు పాలకొల్లు. 1983లో టీడీపీ స్థాపించినది మొదలుగా 2024 వరరకూ పది సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కేవలం రెండు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన ఎనిమిది సార్లూ టీడీపీ విజయ ఢంకా మోగించింది. ఇక అందులో అల్లు సత్యనారాయణ నాలుగు సార్లు గెలిస్తే మూడు సార్లు నిమ్మల గెలిచారు. నిమ్మల నిరంతరం ప్రజలలో ఉంటారు. సామాన్యుడిగా ఆయన జీవితం ఉంటుంది. దాంతో ఆయనకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. పైగా బలమైన కాపు సామాజిక వర్గం ఆయనకు అండగా ఉంటోంది. వైసీపీ అయితే ఆయనతోనే మూడు ఎన్నికల్లో రాజకీయ వైరం పెట్టుకున్నా గెలవడంలేదు సరికదా ప్రతీ ఎన్నికకూ మెజారిటీ కూడా టీడీపీకే పెరిగిపోతోంది. అంతలా పాలకొల్లు వైసీపీని సవాల్ చేస్తోంది.
ప్రయోగాల వైసీపీ :
వైసీపీ లోపం ఏంటి అంటే ప్రతీ ఎన్నికకూ ప్రయోగాలు చేస్తూ పోతోంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో అభ్యర్ధిని దించుతోంది. అంతే కాదు ఒకసారి కాపులకు మరోసారి బీసీలకు సీటు ఇస్తోంది. దీంతో మాజీ ఇంచార్జిలు ఒక్కో వర్గంగా మారిపోయారు. ఆ విధంగా వైసీపీ వర్గ పోరుతో సతమతం అవుతోంది. పాలకొల్లు టీడీపీ మాత్రం ఒక్కటిగా పటిష్టంగా ఉంటూ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ పాలకొల్లుని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో నేరుగా జగన్ ఈ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇంచార్జి గుడాల శ్రీహరి గోపాలరావు మీద పార్టీ క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉందని అంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని తప్పించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించకపోతే పార్టీ పాలకొల్లులో మరింతగా ఇబ్బంది పడడం ఖాయమని అంటున్నారు.
వీరంతా సైడ్ అయిపోయారు :
ఇక వైసీపీ 2014 నుంచి చూసుకుంటే చాలా మందికి బాధ్యతలు అప్పగించింది. అలా మేకా శేషుబాబు, డాక్టర్ బాబ్జీ, గుణ్ణం నాగబాబు కవురు శ్రీనివాస్ వైసీపీ భారాలు మోసిన వారుగా ఉన్నారు. వీరిలో మేకా శేషుబాబు 2014లో పోటీ చేస్తే 2019లో డాక్టర్ బాబ్జీ, 2024లో గుడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక పార్టీలో గుణ్ణం నాగబాబు ఉన్నా టికెట్ ఇవ్వలేదు, దాంతో ఆయన అలిగి వెళ్ళిపోయారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తే ఏకంగా 33 వేల ఓట్లు వచ్చాయి. ఇపుడు చూస్తే కూటమి ఉంది. టీడీపీదే ఈ సీటు. దాంతో గుణ్ణం నాగబాబుకు టికెట్ దక్కే చాన్స్ లేదు. దాంతో ఆయనను వైసీపీలోకి తిరిగి తీసుకుని వచ్చి టికెట్ ఇస్తే కనుక 2029 ఎన్నికల్లో వైసీపీ దశ మారుతుందని అంటున్నారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన గుణ్ణం నాగబాబుతో ఇప్పటికే పార్టీ పెద్దలు చర్చించినట్లుగా చెబుతున్నారు. మరి గుణ్ణం నాగబాబు కనుక వైసీపీ తరఫున రంగంలోకి దిగితే నిమ్మలతో ఢీ కొంటారా వైసీపీకి పాలకొల్లులో తొలి విజయం అందిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
