బాబూ హైదరాబాదూ.. జగన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబు మీద జగన్ ఈసారి సరికొత్తగా విమర్శలు చేశారు. ఈ విమర్శలు అంతకు ముందు ఎవరు చేసినా జగన్ మాత్రం ఎపుడూ తన నోట ప్రస్తావించలేదు.
By: Satya P | 23 Oct 2025 9:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు మీద జగన్ ఈసారి సరికొత్తగా విమర్శలు చేశారు. ఈ విమర్శలు అంతకు ముందు ఎవరు చేసినా జగన్ మాత్రం ఎపుడూ తన నోట ప్రస్తావించలేదు. ఈసారి మాత్రం ఆయన బాబుని ఆయన చెబుతున్న మాటలను హైదరాబాద్ తో ముడి పెట్టి మరీ సెటైర్లు వేశారు. అసలు హైదరాబాద్ తో బాబుకు ఏమి సంబంధం అని జగన్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి తన క్రెడిట్ అని బాబు చెప్పుకునే హక్కు ఎక్కడిది అని నిలదీశారు.
హైటెక్ సిటీ ఆయనది :
హైటెక్ సిటీ అన్న ప్రతిపాదన ఆలోచన ఎగ్జిక్యూషన్ అంతా కాంగ్రెస్ కి చెందిన మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డిది అని జగన్ చెప్పుకొచ్చారు. నేదురుమల్లి ప్రభుత్వ రంగ సంస్థగా హైటెక్ సిటీని నిర్మించాలని ప్రతిపాదించారని ఆ విధంగా ఆయన హయాంలో వేగంగా అడుగులు పడ్డాయని అన్నారు. అంతే కాకుండా ఆరు ఎకరాలలో శంకుస్థాపన చేసింది కూడా నేదురుమల్లి అని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు తా తరువాత సీఎం అయ్యాక హైటెక్ సిటీని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలోకి తెచ్చారని అదంతా తన ఘనత అని ఈ రోజుకీ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
బాబు హయాంలో ఐటీ :
జగన్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా 2004లో దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు కేవలం అయిదు వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. అయితే 2004 నుంచి 2009 దాకా వైఎస్సార్ పాలించారని ఆయన హయాంలో ఐటీ ఎగుమతులు ఏకంగా 36 లక్షలకు ఎగబాకాయని అన్నారు. ఈ రోజున హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతుల మొత్తం ఏకంగా రెండు లక్షల కోట్ల దాకా పెరిగింది అంటే ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలదే ఆ ఘనత అన్నారు. అయితే హైదరాబాద్ తో గత రెండు దశాబ్దాలుగా ఏ మాత్రం సంబంధం లేని చంద్రబాబు అంతా తన గొప్పతనం అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు హైటెక్ సిటీని తెచ్చి శంకుస్థాపన చేసిన నేదురుమల్లి జనార్ధన్ పేరుని ఏ రోజూ బాబు ప్రస్తావించలేదని జగన్ విమర్శించారు. హైదరాబాద్ లో అసలైన అభివృద్ధి అన్నది వైఎస్సార్ హయాలోనే జరిగింది అని జగన్ చెప్పారు.
నిజాలు చెప్పేది లేదు :
చంద్రబాబు తన మొత్తం రాజకీయ జీవితంలో నిజాలు ఎపుడూ చెప్పింది లేదని జగన్ ఫైర్ అయ్యారు. ఆయన ఎవరో చేసిన దానిని తన ఘనతగా చెప్పుకోవడమే అలవాటు చేసుకున్నారని జగన్ అన్నారు. క్రెడిట్ చోరీ లో బాబు ఎపుడూ పీక్స్ లో ఉంటారని అభివృద్ధిలో పాలనలో మాత్రం వెరీ వీక్ అని జగన్ దెప్పిపొడిచారు. మొత్తానికి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బాబుకు ఏ మాత్రం సంబంధం లేదని జగన్ ఘాటైన విమర్శలే చేశారు. దీనిని టీడీపీ నుంచి కౌంటర్లు ఎలా వస్తాయో చూడాల్సి ఉంది.
