నుదుట సింధూరంతో మెరిసిన జగన్ !
వైసీపీ పీఏసీ సమావేశానికి హాజరైన జగన్ సరికొత్తగా కనిపించారు. ఆయన బొట్టు ఎపుడూ పెట్టుకోరు.
By: Satya P | 30 July 2025 3:00 AM ISTవైసీపీ పీఏసీ సమావేశానికి హాజరైన జగన్ సరికొత్తగా కనిపించారు. ఆయన బొట్టు ఎపుడూ పెట్టుకోరు. అయితే ఏదైనా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడ సంప్రదాయాలను ఆయన ఆచరిస్తారు. దాని ప్రకారం బొట్టు పెట్టుకుంటారు. కానీ ఏ పండుగ లేదు, విశేషం అంతకంటే లేదు కానీ జగన్ నుదుట ఎర్రగా మెరిసే సింధూరంతో పార్టీ సమావేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచారు. మ్యాటర్ ఏంటి అని పార్టీ నేతలు అంతా చర్చించుకున్నారు.
విషయం అదీ అని తెలిసి :
జగన్ పీఏసీ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఒక మహిళా నేత ఆయనకు నుదుట సింధూరం దిద్దారు అని చెబుతున్నారు. జగన్ ఈ మధ్య అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన పర్యటనలకు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతే కాదు ఆయన అరెస్టు జరిగి తీరుతుందని కూడా చర్చ కూడా మొదలైంది. అయితే తమ అభిమాన నేతకు ఏ రకమైన చెడుగూ అంటరాదని ఆయన అన్నింటా విజయాలు సాధించాలని కోరుకుంటూ సదరు వైసీపీ మహిళా నేత ఆయన నుదుట సింధూరం దిద్దారని అంటున్నారు. పైగా మంగళవారం కావడంతో ఆమెకు ఉన్న సెంటిమెంట్ మేరకు ఆంజనేయస్వామి జగన్ కి రక్షణ గా ఉండేలా ఈ సింధూరం ఆయనకు పెట్టారని అంటున్నారు.
ఆద్యంతం సరికొత్తగా జగన్ :
ఇక జగన్ లో ఇటీవల కొంత మార్పు కనిపిస్తోంది ఆయన గడ్డం నెమ్మది నెరుస్తోంది. అంతే కాదు ఫాల భాగంలో జుత్తు వెనక్కివెళ్తోంది. ఆయనలో పెద్దమనిషి చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన నుదుట సింధూరం మెరియడంతో జగన్ మరింత కొత్తగా కనిపించారు అని అంటున్నారు. అయితే ఏపీలో వైసీపీ పడుతున్న ఇబ్బందులు కానీ పార్టీ పరంగా ఒడుదుడుకులు కానీ ఎక్కడా జగన్ లో ప్రశాంతతను చెరిగిపోనీయలేదని ఆయన ముఖ కవలికలను చూసిన వారికి తెలుస్తోంది అంటున్నారు.
కూల్ గా క్లారిటీగా :
జగన్ ముఖం లో చిరునవ్వు ఎక్కడా చెదరనీయకుండానే చెప్పాలనుకున్నది చెప్పేశారు. మనం అధికారంలోకి వస్తామని కూడా పార్టీ నేతలకు ధీమా ఇచ్చారు. అంతే కాదు వైసీపీని ఇబ్బంది పెడుతున్న వారిని గట్టిగా ఎదుర్కొందామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి పాలన మీద ప్రజలలో వ్యతిరేకత మొదలైంది అని జగన్ చెప్పారు. మనలను ఓడించినందుకు జనాలు ఎంతో బాధపడుతున్నారు అని కూడా ఆయన చెప్పడం విశేషం. తప్పకుండా కూటమి ఓడి తీరుతుందని కూడా ఆయన అంటునారు.
జగన్ గురించే ఆందోళన :
ఇదిలా ఉంటే తాడేపల్లిలో జరిగిన పీఏసీ సమావేశంలో జగన్ కూల్ గా ఉంటే పార్టీ నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించారు. ఒక మహిళ అయితే సింధూరం ఆయనకు అద్దిన తీరు కూడా దానికి నిదర్శనం అని చెబుతున్నారు. జగన్ తన భద్రత పట్ల చూసుకోవాలని పార్టీ సమావేశంలో నేతలు గట్టిగా చెప్పారని అంటున్నారు. జగన్ ఈ మధ్య చేసిన జిల్లా పర్యటనలలో భద్రతాలోపం స్పష్టంగా కనిపించిందని నేతలు గుర్తు చేశారని తెల్సుతోంది. ఈ విషయంలో జగన్ నిర్లక్ష్యం వహించకూడదని కూడా సీనియర్లు అంతా కోరారని చెబుతున్నారు. మరో వైపు జగన్ తొందరలో నెల్లూరు రాజమండ్రీలకు వెళ్తున్న నేపధ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాటు రోప్ పార్టీలని ఏర్పాటు చేయాలని పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరనున్నారని అంటున్నారు.
