అన్న కళ్లల్లో బాధ చూడాలనేనా? కవిత, షర్మిల సేమ్ టు సేమ్
ఏపీలో మాజీ సీఎం జగన్ ఆయన సోదరి షర్మిల, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చెల్లెలు కవిత మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.
By: Tupaki Political Desk | 29 Nov 2025 1:00 AM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్ల వివాదం హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో మాజీ సీఎం జగన్ ఆయన సోదరి షర్మిల, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన చెల్లెలు కవిత మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. చిత్రంగా మాజీ సీఎం జగన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య స్నేహం ఇటీవల కాలంలో ప్రత్యేక చర్చకు దారితీయగా, ఆ ఇద్దరూ ఒకే విధమైన సమస్యలు సొంత చెల్లెళ్ల నుంచి ఎదుర్కోవడం కూడా చర్చకు తావిస్తోంది. ఇదే సమయంలో చెల్లెళ్లు ఇద్దరూ తమ అన్నలను ఇబ్బంది పెట్టేలా రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారా? అన్న అనుమానాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి.
మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేది. జగన్ అక్రమాస్తుల కేసులో జైలులో ఉండగా, ఆయన తరఫున సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి, ఆయన పార్టీ వైసీపీకి కొత్త ఊపిరి పోశారు షర్మిల. అయితే తన త్యాగం, పోరాటాన్ని జగన్ గుర్తించకపోవడమే కాకుండా తండ్రి నుంచి వంశపారపర్యంగా వస్తున్న ఆస్తుల్లో వాటాలు ఇచ్చేందుకు నిరాకరించడంపై షర్మిల వివాదానికి దిగారు. ఆస్తులపై న్యాయపోరాటం చేయడంతోపాటు ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు అనేక అడుగులు వేశారని అంటున్నారు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు కవిత పావులు కదుపుతున్నారు.
తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారసత్వంగా పార్టీపై తనకు సమాన అధికారం కావాలని కోరుకున్న కవిత.. అనూహ్యంగా పార్టీకి దూరమయ్యారు. ఇలా తాను బయటకు రావడానికి అన్న కేటీఆర్ కారణమని కవిత కారాలు మిరియాలు దువ్వుతున్నారు. అయితే ఏపీలో షర్మిల చేస్తున్నట్లు తీవ్రమైన విమర్శలు ఏవీ కేటీఆర్ పై చేయకపోయినా, ఆయనను కార్నర్ చేసేలా పలు కార్యక్రమాలకు దిగుతున్నారు కవిత. దీంతో షర్మిల-కవిత పొలిటికల్ స్ట్రాటజీ చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా ఈ ఇద్దరు తమ అన్నలకు రాజకీయ ప్రత్యర్థులు అయిన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి సహకరించేలా నడుచుకుంటున్నారనే తాజా ప్రచారం హీట్ పెంచుతోంది.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు వెళ్లిన కవిత.. కాంగ్రెస్ జెండాను పోలిన రంగుల అంచున్న తెల్ల చీరను ధరించడంపై అనేక ఊహాగానాలకు కారణమయ్యారు. సాధారణంగా కవిత మంచి రంగుల చీరలు, డిజైనర్ శారీలలో ఎక్కువగా కనిపిస్తారు. ఆమె రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ జెండాను పోలిన వస్త్రాలు ధరించలేదు. అయితే అధికార పార్టీ నేతలు అందరూ చేరే చోట తాను కొత్త ఆరంభాన్ని కోరుకుంటున్నట్లు సంకేతాలిచ్చే వస్త్రధారణలో ఆమె కనిపించడమే చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సమయంలో షర్మిల పసుపు రంగు చీర ధరించారు. అప్పట్లో చంద్రబాబు సీఎం కాకపోయినా, ఆయనను కలిసే సమయంలో టీడీపీ రంగు అయిన పసుపు రంగు చీరతో షర్మిల వెళ్లడం వైరల్ అయింది. షర్మిల చీరపై ఆయన అన్న జగన్ కూడా అప్పట్లో విమర్శలు గుప్పించారు అంటే అది ఎంత తీవ్రమైన వేదనకు గురిచేస్తుందో చెప్పొచ్చని అంటున్నారు.
ఇప్పుడు కవిత సైతం షర్మిల మాదిరిగా కలర్ కోడ్ తో తన అన్నకు ఇండికేషన్ ఇస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి ఆ స్థానం దక్కించుకోవాలని కేటీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన ఆశలపై నీళ్లు జల్లుతూ కవిత సీఎం రేవంత్ రెడ్డికి దన్నుగా నిలిచేలా అడుగులు వేస్తున్నారని తాజా ఎపిసోడ్ తర్వాత పొలిటకల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు మహిళా నేతలు తమ అన్నల కళ్లల్లో బాధ చూడటానికి వారి రాజకీయ ప్రత్యర్థులతో కలిసి రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
