Begin typing your search above and press return to search.

వారికి టికెట్ ఇవ్వ‌ను: జ‌గ‌న్ వార్నింగ్‌

"స్థానిక సంస్థల‌ ఎన్నిక‌ల్లో ప‌నితీరును చూస్తా. ఎక్క‌డ కూడా ఏక‌గ్రీవాలు జ‌ర‌గ‌డానికి వీల్లేదు. అలా జ‌రిగితే.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల‌ను మార్చేస్తా."

By:  Garuda Media   |   26 Aug 2026 8:15 AM IST
వారికి టికెట్ ఇవ్వ‌ను: జ‌గ‌న్ వార్నింగ్‌
X

"స్థానిక సంస్థల‌ ఎన్నిక‌ల్లో ప‌నితీరును చూస్తా. ఎక్క‌డ కూడా ఏక‌గ్రీవాలు జ‌ర‌గ‌డానికి వీల్లేదు. అలా జ‌రిగితే.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ల‌ను మార్చేస్తా."- అని వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న పార్టీ నాయ‌కుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తాజాగా మంగ‌ళ‌వారం పార్టీ నాయ‌కులు, స్థానిక సంస్థ‌ల ఇంచార్జ్‌ల‌తో జ‌గ‌న్ తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో ఏక‌గ్రీవాల విష‌యంలోను ఆయ‌న హెచ్చ‌రిక‌లు చేశారు.

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు.. స్థానిక ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. పార్టీ 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో ఆ ఎఫెక్ట్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు లోకల్ బాడీ ఎన్నిక‌లు క‌లిసి వ‌స్తాయ‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. అయితే.. ఈ విష‌యంలో ఎవ‌రైనా నిర్ల‌క్ష్యం వ‌హించినా.. స్థానిక ఎన్నికల‌ను లైట్ తీసుకున్నా..ఊరుకునేది లేద‌న్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఈ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్కరి ప‌నితీరుకు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

జ‌గ‌న్‌-2.0 యాప్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌చార స‌రళిని నిక్షిప్తం చేయాల‌ని జ‌గ‌న్ సూచించారు. పార్టీ ప‌రంగా అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటామ‌ని తెలిపారు. క్షేత్ర‌స్థాయిలో ఇబ్బందులు వ‌స్తాయ‌ని.. అలాగ‌ని ఇంట్లోనే కూర్చుంటామంటే కుద‌ర‌ద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యంలో త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. నియోజ‌కవ‌ర్గ ఇంచార్జ్‌ల‌కు ఈ ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని.. వీటిలో విజ‌యం సాధించిన వారిని గుర్తు పెట్టుకుని ప‌ద‌వులు ఇస్తామ‌ని చెప్పారు. మూడేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్నాయ‌ని.. అనంత‌రం.. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని చెప్పారు.

పోలీసుల వేధింపుల‌ను త‌ట్టుకుని ముందుకు సాగాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఈ విష‌యంలో కూడా నాయ‌కులు నిర్దిష్ట విధానాల‌ను అవ‌లంభించాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఈ ప్ర‌భుత్వం వేధించాల‌ని చూస్తోంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు ముందుకు సాగాల‌ని సూచించారు. పోలీసుల‌కు కూడా ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు. మూడేళ్ల త‌ర్వాత‌.. మీ ప‌రిస్థితి ఏంటో చూసుకోవాలి.. అని హెచ్చ‌రించారు. ప్ర‌తి ఒక్క‌రి పేరును గుర్తు పెట్టుకుంటున్న‌ట్టు తెలిపారు. వేధించే వారిని వ‌దిలి పెట్టేది లేద‌ని.. ఎ క్క‌డున్నా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.