Begin typing your search above and press return to search.

జగన్ చెబుతున్నారు...వారు వింటున్నారా ?

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో వీక్ గా ఉన్న అసెంబ్లీ సీట్ల మీద జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు.

By:  Satya P   |   2 July 2026 9:23 AM IST
జగన్ చెబుతున్నారు...వారు వింటున్నారా ?
X

వైసీపీ అధినేత విపక్షంలోకి వచ్చాక క్యాడర్ విషయం పక్కన పెడితే నియోజకవర్గం స్థాయి నేతలకు మాత్రం అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఇంచార్జిలు అయితే సులువుగానే ఆయన్ని కలుస్తున్నారు. మరికొందరికి అయితే ఆయన స్వయంగా పిలిపించుకుంటున్నారు అని అంటున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్ ఉంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులను ఆయన కలుస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీలకు వైసీపీ ఇంచార్జిలుగా ఉన్న వారి మీద జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

నివేదికలు ఆధారంగానే :

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో వీక్ గా ఉన్న అసెంబ్లీ సీట్ల మీద జగన్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంచార్జిలను మార్చే ఆలోచన లేకపోయినా ఉన్న వారినే అలెర్ట్ చేస్తూ యాక్టివ్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో జగన్ తన సొంత సర్వేలు, తనకు ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కధాంశాల ఆధారంగా ఆయా ఇంచార్జిలను పిలిపించుకుని మరీ మాట్లాడుతున్నారు అని అంటున్నారు. తనతో కలిసిన వారికి జగన్ ఒక్కటే మాట చెబుతున్నారు అని అంటున్నారు.

పార్టీ పటిష్టత గురించి :

ఇక పార్టీని పటిష్టం చేయాలని జగన్ సూచిస్తున్నారు. సర్ వల్ల ఒక్క ఓటు కూడా వైసీపీ సానుభూతిపరులది పోకూడదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు క్యాడర్ తో జనంతో మమేకం కావాలని కోరుతున్నారు. అదే విధంగా స్థానికంగా సమస్యల మీద పోరాటాలు చేయాలని కూడా జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో రాజకీయ పరిస్థితులు అధికార కూటమి బలాబలాలను కూడా అంచనా వేసుకుని పార్టీలో స్పీడ్ పెంచాలని కోరుతున్నారు.

జరుగుతోందా అంటే :

అయితే జగన్ వద్దకు తాముగా వెళ్తున్న నాయకులు కానీ లేదా ఆయన పిలిపించుకుని సూచనలు సలహాలు ఇస్తున్న నాయకులు కానీ పనితీరు మెరుగుపరచుకున్నారా అంటే కొన్ని చోట్ల అయితే పెద్దగా మార్పు అయితే లేదని అంటున్నారు. ఎందుకంటే వారు గడచిన రెండేళ్ళుగా ఉదాశీనంగానే ఉంటున్నారు అని అంటున్నారు. రెండేళ్ళు గడచినా ఇంకా నేతలు ఫీల్డ్ లోకి దిగని అసెంబ్లీ నియోజకవర్గాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల మీద గ్రౌండ్ లెవెల్ లో చాలా మంది నేతలు అయితే పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. ఎటూ కూటమి బలంగా ఉంది, అధికారంలో కూడా ఉంది, దాంతో వారే గెలిచి తీరుతారు అని ముందే లెక్క వేసుకుని పోటీ పడడం వేస్ట్ అన్న ధోరణిలో నేతలు కొందరు ఉన్నారని చెబుతున్నారు.

సత్తా తేలాలి కదా :

అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం నేతల సత్తాకు స్థానిక ఎన్నికలనే కొలమానంగా ఒక పరీక్షగా పెడుతోంది అని అంటున్నారు. ఎవరైతే మంచి పెర్ఫామెన్స్ కనబరచారో వారినే తరువాత కాలంలో కూడా ఇంచార్జిలుగా కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. పూర్ గా ఉన్న చోట మాత్రం భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇక్కడ గెలుపు ఓటముల కంటే నాయకులు ఎంతగా కష్టపడ్డారు రియల్ గా గ్రౌండ్ లో నిలిచి క్యాడర్ కి ఎంతగా అండగా ఉన్నారు అన్నదే వైసీపీ హైకమాండ్ చూస్తుంది అని అంటున్నారు. దాంతో ఈ ఏడాది నవంబర్ లో జరిగే లోకల్ బాడీ ఎన్నికల తరువాత వైసీపీలో పెను మార్పులు ఖాయమని ప్రచారం కూడా సాగుతోంది.