Begin typing your search above and press return to search.

పోయి రావలె పులివెందులకు....జగన్ కి అనివార్యమేనా ?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్య తరచూ పులివెందుల వెళ్తున్నారు.

By:  Satya P   |   25 Jun 2026 9:04 AM IST
పోయి రావలె పులివెందులకు....జగన్ కి అనివార్యమేనా ?
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్య తరచూ పులివెందుల వెళ్తున్నారు. ప్రతీ రెండు మూడు నెలలకు ఒకసారి ఆయన అక్కడ పర్యటనలు చేస్తున్నారు. అంతే కాదు ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారు. జనంతో మమేకం అవుతున్నారు. మధ్యలో కొన్ని ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వెళ్ళినపుడల్లా మూడు రోజుల పాటు గడుపుతున్నారు. మరి జగన్ పులివెందుల ఎందుకు ఇంతలా వెళ్ళాల్సి వస్తోంది అంటే డిఫరెంట్ స్టోరీ అక్కడే ఉంది అని అంటున్నారు.

యాభై ఏళ్ళ కంచుకోట :

పులివెందుల ఈనాటిది కాదు, 1978 నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి కట్టుబడిపోయింది. అక్కడ చెట్టూ చేమా పుట్టా గుట్టా అన్నీ కూడా వైఎస్సార్ కుటుంబం మాటనే పలుకుతాయి. రెండో పార్టీ లేదు, మరో మాట అంతకంటే లేదు. వైఎస్సార్ పులివెందుల నుంచి ఆరు సార్లు గెలిచారు. జగన్ మూడు సార్లు గెలిచారు. వివేకా కూడా రెండు సార్లు గెలిస్తే విజయమ్మ ఒకసారి గెలిచారు. ఇంతలా వైఎస్సార్ కుటుంబంతో మమేకం అయిన పులివెందుల ప్రజాభిమానం పలుచన అవుతోంది అన్నది ఆ మధ్యన జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ద్వారా లోకానికి తెలిసింది. వైసీపీకి ఏకంగా డిపాజిట్లు గల్లంతు అయిన నేపథ్యం అందరికీ ఆశ్చర్యపరచింది. అయితే దీని వెనక అధికార పార్టీ ఆగడాలు అని వైసీపీ నేతలు ఆరోపించినా వైసీపీ శ్రేణులు నీరసించిపోవడమే అసలైన కారణం అన్నది లోతైన రాజకీయ విశ్లెషణగా ఉంది అని అంటున్నారు.

క్యాడర్ తో గ్యాప్ :

వైసీపీకి అన్ని చోట్లా ఉన్న సమస్యే పులివెందులలో ఉంది. క్యాడర్ తో లీడర్ల గ్యాప్ అక్కడ పట్టి పీడిస్తోంది. గతంలో వైఎస్సార్ టైం లో చూస్తే కనుక వివేకా అన్నీ దగ్గరుండి చూసుకునే వారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నాను అని కూడా ఆయన భరోసా ఇచ్చేవారు. దాంతో పులివెందులలో చెక్కు చెదరని అభిమానం అలాగే వైఎస్సార్ ఫ్యామిలీకి నిలిచింది. ఇపుడు అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా మాదిరిగా జనంతో కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతో పాటు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కూడ దూకుడుగా రాజకీయం చేస్తారు. దాంతో వైసీపీ నిర్లిప్తత టీడీపీ అడ్వాంటేజ్ గా మారుతోంది అని అంటున్నారు.

మునిసిపల్ పోరులోనూ :

ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీని గెలుచుకున్న టీడీపీ పులివెందుల మునిసిపాలిటీని గెలుస్తామని అంటోంది. దాని మీదనే బీటెక్ రవి ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటనలు ఆసక్తిని పెంచుతున్నాయి. అందరితో ఆయన కలసి వస్తున్నారు. క్యాడర్ కి భరోసా అని చెబుతున్నారు. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని జగన్ ఇంకా గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళాల్సి ఉందని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం. ఆయన ఎమ్మెల్యే అందువల్ల మండల నాయకుల నుంచి గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకులతో నేరుగా భేటీలు వేసి వారి సందేహాలను తీర్చి తాను ఉన్నాను అని భరోసా ఇస్తేనే పులివెందుల కంచుకోట బీటలు వారకుండా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా గతానికి భిన్నంగా జగన్ టూర్లు అయితే కొంతమేరకు క్యాడర్ కి సంతృప్తిని కలిగిస్తున్నాయని అంటున్నారు.