Begin typing your search above and press return to search.

‘ రైతులకు చంద్రబాబు హానికరం, ప్రమాదకరం’.. మాజీ సీఎం జగన్ రెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 6:18 PM IST
‘ రైతులకు చంద్రబాబు హానికరం, ప్రమాదకరం’.. మాజీ సీఎం జగన్ రెడ్డి ఫైర్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో పొగాకు రైతుల పరామర్శ సందర్భంగా జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రైతులకు హాని అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో పొగాకు 360 రూపాయలకు పైగా ధర పలికితే కూటమి ప్రభుత్వంలో హైగ్రేడ్ పొగాకు కేవలం రూ.260 మాత్రమే వస్తుందని తెలిపారు. తాను వస్తున్నానని తెలిసి రూ.10 పెంచారని చెప్పారు.

పొగాకు రైతుల పరామర్శలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుందంట, మామిడి తింటే షుగర్ వస్తుందంట, పొగాకు హెల్త్ దెబ్బతింటుందంట’’ ఈ విధంగా మాట్లాడుతూ రైతులకు నష్టం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు 27 నెలల పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, కూటమిని నమ్మి రోడ్డున పడ్డారని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకుతోపాటు ఏ పంటకు సరైన ధర లేదని ఎత్తిచూపారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాగా, ఈ పర్యటనలో మాజీ సీఎం జగన్మోహనరెడ్డి కొందరు రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ఇక జగన్ రెడ్డి పర్యటన షరా మామూలే అన్నట్లు భారీ జనసందోహం మధ్య సాగింది. కార్యకర్తల అత్యుత్సాహంతో అధినేత ఇబ్బంది పడాల్సివచ్చిందని చెబుతున్నారు. కొందరు కార్యకర్తలు బందోబస్తును తోసుకుంటూ అధినేతతో కరచాలనం చేసేందుకు పోటీ పడటం వైరల్ అవుతోంది. ఓ అభిమాని చొక్కావిప్పి గుండె బాధుకుంటూ జగన్ రెడ్డి ముందు హంగామా చేశాడు.

మొత్తానికి జగన్ రెడ్డి తాజా పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. గత రెండు వారాలుగా క్రమం తప్పకుండా జిల్లాల పర్యటనకు వెళుతున్న మాజీ సీఎం ఈ సారి రైతుల సమస్యను హైలెట్ చేసేందుకు ఎక్కువగా దృష్టి పెట్టారని చెబుతున్నారు. గత నెలలో ఒకసారి విశాఖలో మత్స్యకారుల పరామర్శ, మరోసారి శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఓదార్చేందుకు జగన్ రెడ్డి పర్యటించారు. తాజా పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నించారు. దీంతో జగన్ రెడ్డి పర్యటనలు పార్టీలో కొత్త జోష్ తీసుకువస్తున్నాయని చెబుతున్నారు.