పులివెందుల ఎన్నిక : వైఎస్ జగన్ సంచలన ట్వీట్
పులివెందులలో ప్రజాస్వామ్య ఎన్నిక జరగడం లేదని వ్యాఖ్యానించిన ఆయన చివరికి ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
By: Garuda Media | 10 Aug 2025 7:47 PM ISTఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో జరుగున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలపై అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నిరసించిన ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సుదీర్ఘ ట్వీట్ చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించమే కారణమని ఆ ట్వీట్ లో విమర్శించారు. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచక వాదని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకునే రాజకీయాలు చేయరని జగన్ విమర్శించారు. పులివెందులలో ప్రజాస్వామ్య ఎన్నిక జరగడం లేదని వ్యాఖ్యానించిన ఆయన చివరికి ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సుమారు 8 అంశాలను ప్రస్తావిస్తూ జగన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలుచేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మరోమారు మన కళ్లెదుటే రుజువులు కనిపిస్తున్నాయి’’ అన్నారు జగన్. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబును విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ముకాసే పోలీసులు ముఠాగా ఏర్పడి పులివెందుల ఎన్నికను హైజాక్ చేయడానికి చూస్తున్నారని ట్వీట్ చేశారు జగన్.
పులివెందుల, ఒంటిమిట్ట ZPTCల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నుంచి పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించిన జగన్, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని, ఇంతవరకు పోలీస్‌స్టేషన్ గడపతొక్కని వారిని, ఎలాంటి కేసులు లేనివారిని కూడా బైండోవర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైయస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడి చేశాయని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 6న బీసీ నేత, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైయస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ రెండు ఘటనల్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ నేతలపైనే ఎదురు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.
అదేవిధంగా అధికారపార్టీతో చేతులు కలిపిన అధికారులు, వైయస్సార్‌సీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్ బూత్‌లను పక్క గ్రామాలకు మార్చారని ఆరోపించారు. ఓటు వేయాలంటే రెండు గ్రామాల ప్రజలు 2 కి.మీ, మరో రెండు గ్రామాల ప్రజలు 4 కి.మీ దూరం వెళ్లాల్సి ఉంటుందని తన ట్వీట్ లో పేర్కొన్నారు జగన్. పులివెందుల జడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4 వేల మంది ఓటర్లను, పక్కా వైయస్సార్‌సీపీకి చెందిన గ్రామాలకు చెందినవారిని ఇబ్బందిపెట్టి, ఓటేయడానికి వెళ్లనివ్వకుండా బెదిరించాలని చూస్తున్నారని, తద్వారా ఓటింగ్‌ను తగ్గించడం, బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
